HYD: ఓల్డ్ సిటీలో ఓ మందుబాబు ఓవరాక్షన్.. పోలీసు చెంపపై కొట్టి..
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ పాతబస్తీలోనూ పోలీసులు టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మందుబాబు రెచ్చిపోయాడు. పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల పనిపట్టారు. తనిఖీల్లో పలువురు మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికొపోయారు. హైదరాబాద్ పాతబస్తీలోనూ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా ఓ మందుబాబు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసు సిబ్బందిపైనే దాడికి దిగాడు. నా బండి ఎందుకు ఆపావంటూ మహేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా ఓ పోలీసు చెంపపై కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిసి 3వేల 258కుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1500లకుపైగా కేసులు నమోదవగా, సైబరాబాద్‌లో ఇద్దరు మహిళలతోపాటు తాగి వాహనాలు నడిపన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండలో 517 కేసులు నమోదైయ్యాయి..
న్యూఇయర్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేసి.. వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు .పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..