Vijayashanthi: ఎన్నికల కోసమే ప్రజలకు తాయిలాలు.. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయంః విజయశాంతి
హుజురాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు.
Vijayashanthi fires on CM KCR: హుజురాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం కేసీఆర్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు బీజేపీకే పట్టం కడతార్న ఆమె.. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాములమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘తెలంగాణలో వేలాది ప్రభుత్వ కొలువుల భర్తీ అంటూ ఉప ఎన్నికలప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ చెబుతున్నారన్న ఆమె.. ఒక్క నిరుద్యోగి కూడా టీఆర్ఎస్ నేతల మాటలు నమ్మట్లేదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి హామీని సారు ఏనాడో మర్చిపోయారని మండిపడ్డారు. రాష్టవ్యాప్తంగా సుమారుగా లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… భర్తీ చేస్తామని చెప్పిన 50 వేల ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేయలేదని విజయశాంతి పేర్కొన్నారు.
‘నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజుల రూపంలో వసూలయ్యే సొమ్ముతోనే టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి జీతాలందుతోంటే…. ఇప్పటికే వయోపరిమితి దాటిపోతున్న ఎందరో నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం చూసీ చూసీ విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘టీఎస్‌పీఎస్సీ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై జీవో కూడా జారీ అయినప్పటికీ నోటిఫికేషన్ల విడుదల ఏళ్లకేళ్లు ఆలస్యం అవుతున్న కొద్దీ వయోపరిమితి దాటుతున్న వారి సంఖ్య వేలల్లో పెరిగిపోతోంది’ అని విజయశాంతి చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమవుతుందని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో అవినీతి పాలన ఏ రకంగా ఉందన్నది ప్రజలకు వివరిస్తారని, అలాగే ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజీపీయే ప్రత్యమ్నాయని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని విజయశాంతి అన్నారు.