Andhra Pradesh: గృహ నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష.. వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం..
Andhra Pradesh: గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఎన్ఆర్‌జీఎస్ డబ్బును ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Andhra Pradesh: గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఎన్ఆర్‌జీఎస్ డబ్బును ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి కూడా ఏపీకి నిధులు రావాల్సి ఉందని, వాటిని రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణాలు తదితర అంశాలపై బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఎన్ఆర్‌జీఎస్ పనులపై పూర్తిగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీ పీఓలు, సబ్ కలెక్టర్లు అందరినీ గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేయమని చెప్పామని, ఈ తనిఖీల విషయంలో అందరూ మంచి పురోగతి చూపారని ప్రశంసించారు. వివిధ డిపార్ట్‌మెంట్ల పోస్టర్లు, వెల్‌ఫేర్ క్యాలెండర్లు, బయోమెట్రిక్ అటెండెన్స్, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణతో పాటు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల పనితీరును కూడా పర్యవేక్షణ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
హౌసింగ్ లే అవుట్లలో ప్లాట్ల మ్యాపింగ్ వర్క్‌ని వచ్చే 10 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. తద్వారా అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులుగా గుర్తించిన వారికి ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగులో ఉన్న సుమారు 8వేల దరఖాస్తులకు వెంటనే వెరిఫికేషన్ పూర్తిచేయాలన్నారు. అర్హులుగా గుర్తించిన 1,99,663 లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో 45,212 మందికి పట్టాలు, కొత్త లే అవుట్లలో 10,801 మందికి పట్టాలు, మరో 1,43,650 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు 25 నుంచి ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లు 3.25 లక్షలు అని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే 1.77 లక్షల ఇళ్లకు సంబంధించి 12,855 గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కో గ్రూప్‌లో హెడ్‌మేసిన్, 20 మంది లబ్ధిదారులు ఉంటారు. మిగిలిన చోట్ల గ్రూపుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్టోబరు 25లోగా అన్నిరకాల సన్నాహకాలు పూర్తికావాలన్నారు. ఆయా కాలనీల్లో నీరు, కరెంటు సదుపాయాలను సెప్టెంబరు 15లోగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వారానికి ఒకసారి కలెక్టర్లు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలని ఆదేశించారు.
Also read:
Pony Varma: ప్రకాష్ రాజ్ రెండో భార్య పోనీ వర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?