Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By-Poll: తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. హస్తినలో హుజూరాబాద్ గెలుపు వ్యూహాలు

Huzurabad By-Election: టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ సమాజం ముందు నిలబడేందుకు కాంగ్రెస్ – బీజేపీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

Huzurabad By-Poll: తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. హస్తినలో హుజూరాబాద్ గెలుపు వ్యూహాలు
Huzurabad By Elections
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2021 | 5:00 PM

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)  ఒకవైపు గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తుంటే, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు మరోవైపు హస్తినలో ప్రతివ్యూహాల పథక రచన చేస్తున్నాయి. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ సమాజం ముందు నిలబడేందుకు కాంగ్రెస్ – బీజేపీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప-ఎన్నికల తేదీ ప్రకటించకముందే భారతీయ జనతా పార్టీ(BJP) ప్రచారపర్వానికి సిద్ధమైంది. షెడ్యూల్ కంటే ముందే బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. అభ్యర్థి సిద్ధంగా ఉండడం ఆ పార్టీకి అడ్వాంటేజిగా మారగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థిని నిర్ణయించేలోగా ప్రచారపర్వంలో దూసుకుపోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. హుజూరాబాద్ ఉప-ఎన్నికల్లో గెలుపే పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెడుతుందని బలంగా విశ్వసిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ వంటి బలమైన నేత బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ, గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ, అతివిశ్వాసం ఏమాత్రం పనికిరాదని భావిస్తోంది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీలో ఈ అంశాలే చర్చకొచ్చాయని తెలిసింది.

ఇకపోతే ఈటల రాజేందర్ తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర పార్టీ నేతల్లో విశ్వాసం నింపిందని చెప్పవచ్చు. నిజానికి బీజేపీలో చేరిన సమయంలోనే ఆ పార్టీ అగ్రనేతలు మోదీ-షాలతో భేటీ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నించారు. అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు సమయం తీసుకుని మరీ వచ్చారు. అమిత్ షాను కలిసినప్పుపడు ఈటలతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్‌ కుమార్, గుజ్జుల ప్రేమెందర్‌ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ కూడా హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు అమిత్ షాతో అనేకాంశాల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప-ఎన్నికలు సహా రానున్న రోజుల్లో బీజేపీ గెలుపుపై భరోసా కల్పించినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి కాషాయ జెండాను ఎగరేయడమే లక్ష్యంగా నేతలు పోరాడాలని, ఇందుకోసం తాను ఎన్నిసార్లయిన తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమని చెప్పి ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేల ఫలితాలు హుజూరాబాద్‌లో ఈటల గెలుపు ఖాయమని చెబుతున్నాయని, ఈ గెలుపు ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ప్రజలందరికీ చాటిచెప్పాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని నిర్మించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొనేందుకు అమిత్ షా అంగీకరించినట్లు తెలుస్తోంది. బై పోల్ తేదీ ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గంలో అమిత్ షా ఎన్నికల సభ నిర్వహించనున్నారు.

Etala Rajender Meets Amit Shah

Etala Rajender Meets Amit Shah

కమలం వికసించేనా? అమిత్ షాతో భేటీ అనంతరం రాష్ట్ర నాయకత్వంలో కొత్త ఉత్సాహం కనిపించింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి నాంది పలికిన ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ కార్యక్రమానికి అమిత్ షాను ఆహ్వానించామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలిచేది బీజేపీయేనని సంజయ్‌ అన్నారు. అధికారపార్టీ పంచిపెట్టే డబ్బు ప్రజల సొమ్మే కాబట్టి ఎంత పంచినా తీసుకోవాలని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నిసార్లైనా తెలంగాణలో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నానని అమిత్‌ షా చెప్పడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని, నిజానికి అభ్యర్థి దొరక్క అధికార టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని అన్నారు.

Mp Rahul Gandhi And Revanth Reddy Walks Out

Mp Rahul Gandhi And Revanth Reddy

ఇంటిదొంగల పనిపట్టాలి బీజేపీ సంగతిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్ ఎన్నికల కోసం హస్తినలో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేసే నష్టం కంటే ఇంటి దొంగలు చేసే నష్టమే ఎక్కువని తెలంగాణ పీసీసీ కొత్త సారధి రేవంత్ రెడ్డి ఈ మధ్య బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ముందు ఇంటిదొంగల పనిపడితే, ఆ తర్వాత పార్టీ గాడిలో పడుతుందని ఆయన భావిస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ఆయన రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై స్టాండింగ్ కమిటీలో చర్చకు చైర్మన్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే అవకాశం లభించినట్టు తెలిసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో వెలుగుచూసిన కౌశిక్ రెడ్డి వ్యవహారం గురించి వివరంగా చెప్పి, ఈ తరహాలో పార్టీలో చాలామంది కోవర్టులున్నారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే, కొంతమంది సీనియర్ నేతలే తమ సొంత సీటు గెలిస్తే చాలనే ఉద్దేశంతో పార్టీ ప్రయోజనాలను పూర్తిగా ఫణంగా పెట్టారని రాహుల్ గాంధీకి వివరించినట్టు సమాచారం. ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు తలొగ్గకుండా పార్టీ కోసం శ్రమిస్తున్న అనేక మంది కొత్త తరం నేతలకు అవకాశాలు కల్పించాలని కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప-ఎన్నికలను రాబోయే 2023 ఎన్నికలకు ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. రేవంత్ ఆలోచనలతో రాహుల్ గాంధీ ఏకీభవిస్తూ, ఆయన మరికొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. పదవుల కోసం, అధికారం కోసం ఆశపడి పార్టీని వీడి వెళ్లిపోయే నేతల గురించి అస్సలు ఆలోచించవద్దని, సీనియర్ల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్లాలని భుజం తట్టి ప్రోత్సహించినట్టు తెలిసింది. మొత్తంగా హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డికి స్వేచ్ఛనిచ్చినట్టు సమాచారం.

(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో)

Also Read..

ప్రధాని నరేంద్ర మోదీ మనీ హుండీ.. తయారు చేసిన శిల్ప కళాకారుడు

ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానంటా.. ఆ వార్తలు బాధ కలిగించాయి.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్..