Telangana Rains: మేఘమై గర్జించిన వాన.. ఆగమాగం చేస్తోంది.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..!
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. మరో రెండు మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
జగిత్యాల జిల్లా ఏకీనిపూర్ గ్రామంలో ఒక్కసారిగా వాగులోకి వరద వచ్చింది. దీంతో వాగుమధ్యలో ఉండిపోయిన ఓ యువకుడు.. వరదలో చిక్కుకుపోయాడు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాపాడాలని వేడుకున్నాడు. ఆ యువకుడిని గుర్తించిన గ్రామస్తులు.. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకుని, స్థానికుల సహాయంతో పోలీసులు అతన్ని రక్షించారు. జగిత్యాలలోనే విజయ్‌తో పాటు మరో వ్యక్తి కూడా వాగులో చిక్కుకున్నాడు. విజయ్‌ని గ్రామస్తుల సహాకారంతో పోలీసులు సుక్షితంగా బయటకు తీసుకురాగా.. మరో వృద్దుడిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అటు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పలు పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. పనుల మీద బయటకు వెళ్లాలనుకునే ప్రజలు.. వాగులు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటపొలాలు.. చెరువులను తలపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం జనజీవనాన్ని స్తంభింపచేసింది. యాదాద్రి జిల్లాలో ధర్మారెడ్డిపల్లి కాల్వకు గండి పడడంతో.. వరద నీళ్లు.. వరిపంటలను ముంచెత్తింది. మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. బొల్లేపల్లి సంగెం మధ్య భీమాలింగం కత్వా దగ్గర రోడ్డు మీద నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. బీబీనగర్ భూదాన్ పోచంపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ ఉధృతంగా ఉండడంతో.. పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలో చాలా చోట్ల చెరువులు అలుగు పోస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో వాగులు ఉరకలు వేస్తున్నాయి. వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టుల్లో జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. ఇన్‌ఫ్లో లక్షా 83వేల క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1083 అడుగులకు చేరుకుంది. నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 60 టీఎంసీలుగా ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు నీటితో నిండిపోయాయి. దీంతో పనులకు ఆటంకం ఏర్పడింది. బోధన్‌లోని త్రివేణి సంగమం నీట మునిగింది.
మరోవైపు.. భద్రాద్రి దగ్గర తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తడంతో.. 9 గేట్లను ఎత్తారు అధికారులు. సిద్దిపేట జిల్లాలో వర్షాలకు.. సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిలో ఉన్న మోయతుమ్మద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక గ్రామాలకు కూడారాకపోకలు నిలిచిపోయాయి.
ఇదిలావుంటే, తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ర్టంలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Also… Krishna water రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలజగడం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ నీటి సంఘాల ఫిర్యాదు Read Also…Krishna water రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలజగడం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ నీటి సంఘాల ఫిర్యాదు