Hyderabad Rains: పేరుకే ‘భాగ్యనగరం’.. చిన్నపాటి వర్షం పడిందో ‘బాధల నగరమే’.. ఈ సమస్యలకు కారణాలేంటంటే..

Hyderabad Rains: భాగ్యనగరం గా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్.. ప్రస్తుతం ప్రంపచ మహానగారాల్లోనే 41 స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు..

Hyderabad Rains: పేరుకే ‘భాగ్యనగరం’.. చిన్నపాటి వర్షం పడిందో ‘బాధల నగరమే’.. ఈ సమస్యలకు కారణాలేంటంటే..
Hyderabad
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2021 | 4:56 PM

Hyderabad Rains: భాగ్యనగరం గా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్.. ప్రస్తుతం ప్రంపచ మహానగారాల్లోనే 41 స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు దేశంలోనే రెండవ పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా నిలిచింది. అయితే, ఇంత పేరు గడించిన ఈ సిటీ.. చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి.. జలసంద్రాన్ని తలపిస్తోంది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. రోడ్లన్నీ నదులవలే మారిపోయాయి. రోడ్లపై వరద నీరు భయంకరంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. దాంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో నిన్న రాత్రి 21.2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మామూలు వర్షానికే అతలాకుతలం అయ్యే నగరంలో.. ఇంత భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే, దినదినాభివృద్ధి చెందుతున్న నగరం.. చిన్నపాటి వర్షానికే ఎందుకు వణికిపోతోంది? ఎందుకు అతలాకుతలం అవుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

భారీగా నమోదైన వర్షపాతం.. వాస్తవానికి 1908లో ఒక్కరోజే 43 సెంటీమీటర్ల వర్షం కురవగా.. అప్పుడు మూసీ నది పోటెత్తింది. మళ్లీ 1916లో ఒక్క ఏడాదిలో 160 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తరువాత అంతటి స్థాయిలో 2020లో 120 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది సగటున 78 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది. కానీ, 2020లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ఒక్క రోజే 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక తాజాగా బుధవారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్, బండ్లగూడలో 21.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో ఆయా ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలు కారణమా..? కొన్నేళ్లుగా హైదరాబాద్‌‌లో వానలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలే కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేఘాల ప్రభావంతోనే భారీ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గంటల వ్యవధిలో 10 సె.మీ పైగా వర్షపాతం నమోదు అవడంతో.. రోడ్లపై భారీగా వరద నీరు చేరుతోంది. గాలిలో ఎక్కువగా తేమ, భారీ ఉష్ణోగ్రతలు, వాతావరణంలో అస్థిరత కారణంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పాడుతున్నాయని చెప్పారు. ఫలితంగా రెండు, మూడు గంటల్లోనే కుంభవృష్టి నమోదవుతుందన్నారు.

కాంక్రీట్ జంగిల్ ఎఫెక్ట్.. దినాదినాభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం.. పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారటంతో నగరం పరిధిలోని వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వర్షాలతో ఇళ్లు, ఆఫీసులు, భవనాలు మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలనే కాదు.. సాధారణ లెవెల్‌లో ఉన్న చోట కూడా వరద ముంచెత్తుతోంది. ఇక రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో.. కిలోమీటర్ ప్రయాణానికి అరగంట నుంచి గంట సమయం పడుతోన్న దుస్థితి ఉంది. ఇక మరీ దారుణం ఏంటంటే.. నీటితో నిండిన రోడ్లపై మ్యాన్‌ హోల్స్ తెరుచుకోవడంతో ఎంతోమంది వాటిలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ విషయంలో జీహెచ్ఎంసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పెరిగిన నగర విస్తీర్ణం.. హైదరాబాద్ నగరం విస్తీర్ణం తొలుత 55 స్క్వేర్‌ మీటర్లు ఉండేంది. ఇప్పుడు 625 స్క్వేర్‌ మీటర్లకు హైదరాబాద్‌ నగర విస్తీర్ణం పెరిగింది. అభివృద్ధి చెందని హైదరాబాద్‌ను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పేరేషన్‌గా మార్పు చేశారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌‌మెంట్ అథారిటీ పేరుతో శివారు ప్రాంతాలను నగరంలో కలిపారు. దీంతో హైదరాబాద్ నగర విస్తీర్ణం 7,257 స్క్వేర్‌ మీటర్లకు పెరిగింది. 2017 లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ పరిధిలో 2,800 వేల చెరువులు ఉన్నాయి. కానీ, పోను పోను అవికూడా కనుమరుగు అవుతున్నాయి.

పెరిగిన కాంక్రీటైజేషన్.. హైదరాబాద్‌ నగరంలో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫలితంగా నగర వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే. జోన్‌-12 పరిధిలోని బేగంపేట, అమీర్‌పేట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, రాజీవ్ గాంధీ నగర్, చందానగర్, తులసి నగర్, లక్ష్మీ నగర్ వంటి ప్రాంతాలలో దాదాపు 89 శాతం కాంక్రీటైజేషన్ పెరిగింది. నగరం నలుమూలలా కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. నగరం విస్తరించడం.. జనాభా పెరగడంతో.. నగరంలో మల్టీ స్టోర్స్ భవనాలు, ఫ్లై ఓవర్లు పెరిగాయి. ఇక మరోవైపు పెరుగుతున్న కాంక్రీటైజేషన్‌ కారణంగా అడవులు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు నగర శివారులో అడవులు, కొండలు, గుట్టలతో ఉండేవి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేవలం 8.61 శాతం మేరకే అడవుల విస్తీర్ణం ఉంది.

వెదర్‌ స్టేషన్స్‌ .. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ప్లాన్‌ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో 156 ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌(ఏడబ్ల్యుఎస్‌) ఉన్నాయి. 2013 వరకు కేవలం 33 వెదర్‌ మేనేజ్‌‌మెంట్‌ స్టేషన్స్‌ మాత్రమే ఉండేవి. నగరం పెరగడంతో.. ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ను కూడా పెంచారు. ఇక తెలంగాణలో మొత్తం 1,044 వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. ఢిల్లీలో 371, ముంబయిలో 151, బెంగళూరులో 57, అహ్మదాబాద్లో 48, చెన్నైలో 47, కోలకతాలో 49 స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.

హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్ధ.. 1908లో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. అయితే, అప్పుడు వరద నీరు ఎక్కడా ఇళ్లల్లోకి రాలేదని పూర్వీకులు చెబుతున్నారు. నాలా వ్యవస్థ పకడ్బందీగా ఉండడంతో నీళ్లు నిలవకుండా నదుల్లోకి వెళ్లాయన్న పెద్దలు చెబుతున్నారు. 1951లో వరదనీరు వ్యవస్ధ, 1922లో మురుగునీటి వ్యవస్ధ, 1940లో మురుగునీటి శుద్ధి కేంద్రం(ఎస్‌టీపీ)లను ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే నిజాం నవాబులు ఆధునిక సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. 1950లో హైదరాబాద్ మురుగునీటి వ్యవస్ధతో సికింద్రాబాద్ పరిశ్రమల నుండి వచ్చే మురుగునీటి కాలువలను అనుసంధానించారు. ప్రస్తుతం నాటి డ్రైనేజీ వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది. నాలాలపైనే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్లపై, ఇళ్లల్లోకి రావడం జరుగుతోంది.

పెరిగిన జనాభా.. 1956 నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ స్టేట్, ఆంధ్రా ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటైన తరువాత.. హైదరాబాద్ నగరానికి వలసలు భారీగా పెరిగాయి. గత 50 ఏళ్ళతో పోల్చుకుంటే నగర జనాభా, నగర విస్తీర్ణం కూడా భారీగా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో 70 లక్షలు జనాభా ఉండగా.. ప్రస్తుతం 1 కోటి 20 లక్షలకు చేరింది.

హైదరాబాద్‌ నాలాలు.. హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్ధ నిర్మాణం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగరానికి 5,000 కిలోమీటర్ల నాలాలు, కాలువలు అవసరం. అయితే.. ప్రస్తుతం కేవలం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాలు ఉన్నాయి. ప్రస్తుతం 25 ఎస్టిపిల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ఆ తర్వాత మూసి నదిలోకి వదులుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా పలుచోట్ల కాలువలు పూడిపోవటంతో నీరు నిలిచిపోతోంది. కొన్ని ప్రాంతాలలో 10 ఫీట్ల వరకు నీరు నిలిచిపోతోంది. ఇలా అనేక రకాల సమస్యల వలయంలో ఉంటూ హైదరాబాద్ నగరం వరుద బారిన పడుతోంది.

సేఫ్ హైదరాబాద్‌ కోసం ఏం చేయాలి?.. ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగు పరచాలి. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలి. ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుండాలి. రెస్యూ టీమ్ లను రంగంలోకి దించి అవసరమైన చర్యలు చేపట్టాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అడవుల శాతాన్ని పెంచడం, ఇంకుడు గుంతలు పెంచడం ద్వారా వరదలను నివారించేందుకు అవకాశం ఉంది. అలాగే జనాభాకు అనుగుణంగా వసతి, సౌకర్యాలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది.

Also read:

Nara Lokesh: పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా చేశాడు..!! జగన్ పై లోకేష్ సెటైర్లు..!! వీడియో

Faria Abdullah: డ్యాన్స్‏తో అదరగొట్టిన ఫరియా అబ్ధుల్లా.. చిట్టి ఆటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

Viral Video: కొండల మధ్యలో కొలను.. 30 అడుగుల ఎత్తు నుంచి యువకుడి డైవింగ్.. భయం తెప్పించే వీడియో!