Telangana: ఇంటికి తిరిగొచ్చిన భార్యకు ఊహించని షాక్.. ఎదురుగా భర్తను అలా చూసేసరికి
నిండు నూరేళ్ల జీవితం మధ్యలోనే పూర్తయిపోతోంది. కుటుంబ కలహాలు, కోపాలు, గొడవలు.. ఇలా వీటితో కొందరు మధ్యలోనే తన జీవితాన్ని అంతం చేసుకుంటుంటే.. పాత కక్షలు, దుండగుల బారిన పడి కొందరు హత్యకు గురవుతున్నారు. ఆ కోవకు చెందిన ఘటన ఇది.. ఆ వివరాలు ఇలా..

ఇంట్లో నిద్రిస్తున్న వృద్దుడిని హత్య చేశారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. రక్తం మడుగులో ఉన్న భర్తను చూసి ఒక్కసారి భయాందోళనకు గురైంది అతడి భార్య. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధాంతి బస్తీకి చెందిన సౌరయ్య(70) అతని భార్య భారతమ్మలకు పిల్లలు లేరు. అయితే సోమవారం భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది.
దీంతో భారతమ్మ కోపంతో బయటకు వెళ్లిపోయింది. భారతమ్మ తిరిగి ఇంటికి వచ్చేసరికి.. ఊహించని సీన్ ఎదురైంది. ఇంట్లో భర్త సౌరయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భయంతో భార్య భారతమ్మ వెంటనే బంధువులకు ఫోన్ చేసి చెప్పగా.. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై బంధువులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో మృతుని ఇంటి వద్దకు చేరుకుంది క్లూస్ టీం. ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని కక్షల కారణంగా హత్యకు గురయ్యాడా.? లేక దొంగలు ఎవరైనా అడ్డు వచ్చాడని మట్టుబెట్టారా.? లాంటి కోణాల్లో విచారణ చేపట్టారు.
