AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దావత్ పేరుతో దారుణం.. మామిడి తోటలో మట్టిలో కలిపేశారు.. అసలు విషయం తెలిస్తే షాక్!

గుప్త నిధుల సమాచారం ఇస్తానని లక్షల రూపాయలు వసూలు చేశాడు. వివరాలు చెప్పమంటే స్పందన లేదు. గట్టిగా నిలదీస్తే మరిన్నీ డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తాంత్రిక పూజల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి దీంతో ఢోకా చేసిన వ్యక్తిని మట్టిలో కలిపేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది.

దావత్ పేరుతో దారుణం.. మామిడి తోటలో మట్టిలో కలిపేశారు.. అసలు విషయం తెలిస్తే షాక్!
Nagarkurnool Crime News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Aug 29, 2025 | 7:02 PM

Share

గుప్త నిధుల సమాచారం ఇస్తానని లక్షల రూపాయలు వసూలు చేశాడు. వివరాలు చెప్పమంటే స్పందన లేదు. గట్టిగా నిలదీస్తే మరిన్నీ డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తాంత్రిక పూజల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి దీంతో ఢోకా చేసిన వ్యక్తిని మట్టిలో కలిపేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది.

తన వద్ద ఉన్న గుప్త నిధుల సమాచారం ఇస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని దారుణంగా హతమార్చారు ఓ గుప్తనిధుల వేట బ్యాచ్. ఆ వ్యక్తిపై దాడి చేసి.. ఇంకా శ్వాసవీడక ముందే పూడ్చేసి సజీవసమాధి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామ సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కోడేరు పోలీస్ స్టేసన్‌లో నమోదైన రంగస్వామి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది.

అచ్చంపేట పట్టణానికి చెందిన పులేందర్ గౌడ్ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తేల్చారు. పులేందర్ గౌడ్ కు ఆరు నెలల క్రితం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగస్వామితో ఓ భూమి కొనుగోలు సందర్భంలో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో తనకు గుప్త నిధుల సమాచారం తెలుసునని వాటి వివరాలు మీకు అందిస్తానని రంగస్వామి పులేందర్ గౌడ్ కు నమ్మబలికాడు. ఇందుకోసం తనకు కొంత మొత్తంలో నగదు అప్పచెప్పాలని కోరాడు. అయితే ఇదే అంశం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి పట్టణాలకు చెందిన తన పరిచయస్తులకు చెప్పాడు పులేందర్ గౌడ్. సుమారు ఎనిమిది మంది కలిసి రంగస్వామి తో డీల్ సెట్ చేసుకున్నారు. ఈ మేరకు రూ.5లక్షల నగదు సైతం చెల్లించారు.

అయితే డబ్బు చెల్లించి 5 నెలలు గడుస్తున్న రంగస్వామి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి గట్టిగా నిలదీశారు. గుప్త నిధులు వెలికి తీయడం మీతో కాదని.. కర్ణాటకకు చెందిన ఓ తాంత్రిక పూజారిని పిలిపిస్తానని వారితో రంగస్వామి చెప్పాడు. ఇందుకు మరో రూ.10లక్షలు ఖర్చు అవుతాయని తేల్చాడు. లేదంటే అదే స్వామిజీతో.. మీపై తాంత్రిక పూజలు చేసి హతమార్చుతామని బెదిరించాడు. అయితే తమ వద్దే డబ్బు తీసుకుని తమనే చంపేస్తానని బెదిరిస్తాడా అని రంగస్వామిపై పులేందర్ గౌడ్ కక్ష పెంచుకున్నాడు.

రంగస్వామి హత్యకు స్కెచ్

ఎలాగైన సరే రంగస్వామిన అంతమొందించాలని భావించిన పులేందర్ గౌడ్, ఆయన బ్యాచ్ పక్కా స్కెచ్ వేశారు. జూలై నెల 29వ తేదీన దావత్ ఉందని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు పిలిచారు. అక్కడి నుంచి అల్లీపూర్ కు తీసుకెళ్లారు. అక్కడే దావత్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. హత్య ప్రణాళికలో భాగంగా వెంట తెచ్చిన కల్లులో కలిపే మత్తు మందును చికెన్, కూల్ డ్రింక్ లో కలిపారు. ఆ ఆహారాన్ని రంగస్వామి తీసుకునేలా చేశారు. తీరా అవి తిని రంగస్వామి మత్తులోకి జారుకోగానే అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామ శివారులోని పులేందర్ గౌడ్ ఫామ్ హౌస్ సమీపంలోని మామిడి తోటలోకి తీసుకెళ్లారు.

బతికి ఉండగానే రంగస్వామిని మామిడితోటలోనే గోతి తీసి పాతిపెట్టాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ప్లాన్ మార్చి రంగస్వామిపై దాడి చేశారు నిందితులు. గోతి తవ్విన గునపంతో ఒక్కసారిగా తలపై బలంగా బాదారు. రంగస్వామి మరణం ధృవీకరణ చేసుకోకుండానే గోతిలో పడేసి పూడ్చేశారు. ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి ఎవరికి వారు జారుకున్నారు. అప్పటి నుంచి పులేందర్ గౌడ్ బ్యాచ్ ఎవరికి ఏమి తెలియనట్లు ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉండిపోయారు.

మిస్సింగ్ కేసు దర్యాప్తులో హత్య మిస్టరీ

ఇక బంధువులు అనారోగ్యంతో ఉన్నారని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్తానని చెప్పిన రంగస్వామి.. జాడ లేకపోవడంతో భార్య బెంగపెట్టుకుంది. రంగస్వామికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత అనేక మార్లు కాల్ చేసిన రంగస్వామి ఫోన్ కలవలేదు. దీంతో హైదరాబాద్‌లోని బంధువులను ఆరా తీయగా.. తమ వద్దకు రాలేదని చెప్పారు. అక్కడా.. ఇక్కడా వెతికి చివరకు కోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది రంగస్వామి భార్య. తన భర్త అదృశ్యమయ్యాడని ఆగస్టు 4వ తేదీన ఫిర్యాదు చేసింది. ఇక మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పలువురిపై పోలీసులకు అనుమానం కలిగింది. అందులో భాగంగా అచ్చంపేట పట్టణానికి చెందిన పులేందర్ గౌడ్ ను తమదైన శైలిలో విచారించగా కేసు మిస్టరీ మొత్తం ఖాకీల కళ్లకు కట్టాడు.

నిందితుడి సమాచారం మేరకు కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని పాతిపెట్టిన రంగస్వామి మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఇక ఘటనపై డీఎస్పీ నేతృత్వంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పులేందర్ గౌడ్ అతని బ్యాచ్ లోని మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రధాన నిందితుడుగా ఉన్న పులేందర్ గౌడ్ నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో జంట హత్యల కేసు, మరో మర్డర్ కేసులో పురేందర్ నిందితుడిగా ఉన్నాడని తేలింది. త్వరలోనే రంగస్వామి హత్య కేసులో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..