అతిథులకు అదిరిపోయే బహుమతి ఇచ్చిన వరుడు.. అందరికీ ఉచితంగా ‘గీతా’జ్ఞానం.. ఇలా ఎందుకు చేశాడంటే..?
Mancherial: వేడుకకు వెళ్లిన బంధువులకు, అతిథులకు వరుడు ఊహించని బహుమతి ఇచ్చి సంబ్రమశ్చర్యానికి గురి చేశాడు. పెళ్లికొడుకు ఇచ్చిన రిటర్న్ గిప్ట్‌తో అతిథులు కూడా ఉబ్బితబ్బియ్యారు. ఈ మధ్య పెళ్లి వేడుకల్లో వాయినాలు ఇవ్వడం సర్వసాధారణమే అయినా ఈ వరుడు ఇచ్చిన వాయినం మాత్రం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఆ వరుడిచ్చిన ఆ గిప్ట్ ఏమిటంటే..
మంచిర్యాల, సెప్టెంబర్ 9: పెళ్లంటే నూరేళ్ల పండుగ.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే రెండు కుటుంబాలు సంబరంగా, బంధుమిత్రలు సమక్షంలో జరుపుకునే వేడుక. ఇక పెళ్లికి వచ్చినవారు వధూవరులకు బహుమతులు ఇవ్వడం సహజమే. అయితే తన పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆలోచనలో పడేశాడు ఓ వరుడు. మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్ యాపా గ్రామానికి చెందిన ఎంబాడి ప్రశాంత్ వర్మకు పెళ్లి నిశ్చయమైంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 8వ తేదీన ఎగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పెళ్లి తంతుకు ముందు జరిగే ఈ వేడుకకు వధూవరుల కుటుంబాల తరుపున బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయితే ఈ వేడుకలో పాల్గొన్న బంధువులు, స్నేహితులకు పెళ్లికొడుకు ప్రశాంత్ సర్ ప్రైజ్ గిఫ్టులు అందజేశాడు. ప్రశాంత్ ఇచ్చిన ఆ గిప్ట్‌లను అందుకున్న బంధువులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ప్రశాంత్ ఇచ్చిన బహుమానం ఏంటంటే హిందువుల అత్యంత పవిత్రంగా బావించే భగవద్గీత. ఆ బహుమానాన్ని కూడా అలా ఇలా ఇవ్వలేదు ప్రశాంత్. తనకు కాబోయే భార్య బరువుకు సమానమైన తులభారం వేసి ఆమె బరువుకు సమానమై భగవద్గీత పుస్తకాలను తూకం వేసి వాటిని అతిధులందరికి పంచి పెట్టాడు వరుడు ప్రశాంత్. ఆ భగవద్గీత బహుమానంలోనే తన వివాహానికి సకుటుంబ సపరివారంగా హాజరు కావాలంటూ పెళ్లి పత్రికను సైతం ముద్రించి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు వరుడి ప్రశాంత్.
అగ్రికల్చర్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రాజమండ్రిలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కి.. అగ్రికల్చర్‌లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తేజస్వినితో త్వరలోనే వివాహం కానుంది. వీరిద్దరి నిశ్చయ తాంబూల కార్యక్రమంలో ఇలా బందువులకు, అతిథులకు భగవద్గీత బహుమతిగా ఇచ్చారు. అసలు భగవద్గీతనే ఎందుకు బహుమానంగా ఇవ్వాలనుకున్నారని వరుడు ప్రశాంత్‌ని అడిగితే.. తన పెళ్లి వేడుకులకు వచ్చే అతిధులందరికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేందుకు ఓ చిన్ని ప్రయత్నం మాత్రమేనని.. భగవద్గీత కేవలం ఓ పుస్తకం మాత్రమే కాదని ప్రపంచానికి జ్ఞానాన్ని పంచే అద్బుతమైన నిఘంటువు అని తెలిపాడు. అతిథులకు భగవద్గీత ఇవ్వడంతో మరో పది మందికి గీతా జ్ఞానాన్ని అందించే అవకాశం దక్కుతుందనే తన నిశ్చయ తాంబులాల కార్యక్రమాన్ని ఇలా మలిచానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.
ఈ భగవద్గీత కాఫీలను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లోని ప్రముఖ గీతా ప్రెస్‌లో ముద్రించామని ప్రశాంత్ తెలిపాడు. ఒక్కొక్కటి 1.250 గ్రాముల బరువు ఉన్న 110 కాపీలను ఆర్డర్ చేశామని చెప్పారు. రెండు దశాబ్దాలుగా తాను యోగా సాధన చేస్తున్నానని.. ఇప్పటికే వందలాది మందికి భగవద్గీతా బోధనలు చేశానని తెలిపాడు ప్రశాంత్. భగవద్గీతను కనీసం తన దగ్గరి వారికైనా చేరువ చేయాలన్న ఓ మంచి నిర్ణయంతో నే రిటర్న్ గిప్ట్ గా భగవద్గీతను అందజేశానన్నారు ప్రశాంత్ వర్మ. ఈ భగవద్గీతలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వివాహ వేదిక ముహూర్తం, వధూవరుల వివరాలు తెలుస్తాయని.. మా పై అభిమానం, ప్రేమకు గుర్తుగా ఈ గీతా పుస్తకాలు నిలుస్తాయన్నారు. ఈ కాలంలో అంతా ఫోన్ మయం అయిన ఈ సమాజానికి జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక బావనను పుస్తక రూపంలో బహుమానం అందజేయడంపై అతిథులు ప్రత్యేక ఆశీస్సులు అందించారు వరుడు ప్రశాంత్ కు.