Telangana: వర్షాల కోసం కప్పలకు పెళ్లి.. వరుణదేవుడిని ప్రసన్నం చేసేందుకు పూనుకున్న గ్రామస్తులు..
Yadadri Bhuvanagiri News: తమ కోర్కెలను తీర్చాలని చాల మంది దేవుళ్ళకు పూజలు చేస్తారు. ముఖ్యంగా వరుణుడి కటాక్షం కోసం అభిషేకాలు చేస్తారు. కానీ ఓ పల్లె వాసులు మాత్రం వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేశారు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ వింత ఆచారం గురించి వివరాల్లోకి వెళ్తే..
వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికి వరుణ దేవుడు కరుణించక పోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వర్షాలు లేక అదును దాటిపోతోందని రైతులు ఆవేదన పడుతున్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం అల్లందేవిచెర్వు గ్రామంలో వర్షాలు కురవకపోవడంతో పత్తి రైతులు రెండు, మూడుసార్లు వేసిన విత్తనాలు విత్తిన మొలకలు రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఎకరాల కొద్ది పత్తి విత్తనాలు వేసినా వర్షాలు వస్తాయో లేదా అని రైతులు దిగులు చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి వృధా అవుతుందని, అప్పులపాలు కాక తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో గ్రామస్తులు, రైతులు కప్ప కాముడు ఆటతో గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. రెండు కప్పులకు పెళ్లి చేశారు. వవ్యసాయ నాగలికి ఉపయోగించే కానికి కప్పలు కట్టి గ్రామంలో ఊరేగించారు. ప్రతి ఇంటి గడప వద్ద కప్ప కాముడుకు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని తాము సిరులు పండించుకునేలా చూడాలంటూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎప్పుడైనా వర్షాలు కురకపోతే కప్పలకు పెళ్లి చేస్తే.. వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..