Telangana: తెలంగాణ ప్రజలకు రేషన్ బియ్యం ఉచితం.. కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రజలకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని టీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం కిలో రూపాయి చొప్పున పంపిణీ చేసేవారు. అయితే కోవిడ్ తర్వాత..

Telangana: తెలంగాణ ప్రజలకు రేషన్ బియ్యం ఉచితం.. కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Free Ration
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 06, 2022 | 3:09 PM

తెలంగాణ ప్రజలకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం కిలో రూపాయి చొప్పున పంపిణీ చేసేవారు. అయితే కోవిడ్ తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్రప్రభుత్వం గుర్తించిన కార్డులకు ఒక్కొక్కరికి మరో ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఈఏడాది డిసెంబర్ వరకు పొడిగించింది. దీంతో ప్రతి నెలా ఒక్కో వ్యక్తికి ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి ఒక్కో వ్యక్తికి పది కిలోల బియ్యాన్ని డిసెంబర్ వరకు పంపిణీ చేయనున్నారు. అయితే కేంద్రప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించిన కార్డులకు మాత్రమే ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులందరికీ పది కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఒకో కిలో బియ్యానికి రూపాయి చొప్పున లబ్ధిదారులు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ఐదు కిలోలకు కూడా లబ్ధిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ డిసెంబర్ వరకు 10 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధించి అక్టోబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.227.25 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 90 లక్షల కార్డులకు, 2.84 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలతో గురువారం నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 90లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని, 2 కోట్ల 83 లక్షల 42 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. వీరిలో కేంద్ర ప్రభుత్వం 54 లక్షల 37 వేల కార్డులకు గానూ కోటి 91 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందన్నారు. వీరందరికి 5కిలోల అదనపు బియ్యంతో పాటు మిగతా 35 లక్షల 64 వేల కార్డులు, 91 లక్షల 72 వేల మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించి ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుందన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల కాలానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేయడానికి 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సేకరిస్తుందన్నారు. వీటి కోసం నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అధనంగా రూ.227.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఇవి కూడా చదవండి

ఇలా ఉండగా.. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా, లాక్ డౌన్ సమయంలో పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారందరికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరికొన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..