Telangana: ‘నాకు రాజకీయం ఒక టాస్క్’.. దేశ రాజకీయాలపై సీఏం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొత్తంమీద తన మదిలోని ఆలోచనలను ఆచరణలో పెడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. దీనిలో భాగంగా జాతీయపార్టీ పేరును ఆయన అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్ లో ప్రకటించారు. భారత్ రాష్ట్ర..

Telangana: 'నాకు రాజకీయం ఒక టాస్క్'.. దేశ రాజకీయాలపై సీఏం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
K. Chandrashekar Rao
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 05, 2022 | 2:53 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొత్తంమీద తన మదిలోని ఆలోచనలను ఆచరణలో పెడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. దీనిలో భాగంగా జాతీయపార్టీ పేరును ఆయన అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్ లో ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితిగా తన జాతీయ పార్టీకి కేసీఆర్ నామకరణం చేశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని విమర్శించారు. తనకు మాత్రం రాజకీయం ఒక టాస్క్ అని చెప్పారు. దేశంలో రైతుల పరిస్థితి ఎంతో అద్ధానంగా ఉందన్నారు. రైతుల సంక్షేమమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు. జాతీయపార్టీ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో మొదట తన జాతీయ పార్టీ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. ఆయా రాష్ట్రాల రైతులకు మేలు జరిగేలా తన వంతు ప్రయత్నం చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు టీఆర్ ఎస్ ను కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం చేస్తే ఎలా అని చాలామంది అడిగారని, తమ రాష్ట్రంలో కూడా పార్టీని విస్తరించాలని కోరారన్నారు. దేశ ప్రజల కోసమే తాను భారత్ రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీని ప్రారంభిచనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

దేశ రాజకీయాల్లో మార్పులు రావల్సిన అవసరం ఉందని, ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్రంలోని పార్టీలు పనిచేయడం లేదంటూ గత కొంత కాలంగా సీఏం కేసీఆర్ విమర్శిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దేశ అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్ లు ఆటంకంగా మారాయని, ఈ రెండు పార్టీలు లేని కొత్త కూటమి కేంద్రంలోని అధికారంలోకి రావల్సిన అవసరం ఉందని, తద్వారా రాష్ట్రప్రభుత్వాలు స్వేచ్చగా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడపగలవనే అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ విమర్శిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తారని, జాతీయ పార్టీని ప్రకటిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే మధ్యలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ మొత్తానికి 2022 అక్టోబర్ 5 విజయదశమి పర్వదినం సందర్భంగా సీఏం కేసీఆర్ భారత్ రాష్ట్రసమితి పేరిట జాతీయ పార్టీని ప్రకటించి.. ఇక నుంచి జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. అయితే ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పోటీచేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. తొలుత మహారాష్ట్ర, కర్ణాటకలో పార్టీ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్పిన నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే చర్చ సాగుతోంది. అయితే తన పార్టీకి సంబంధించిన పూర్తి కార్యాచరణను కేసీఆర్ ప్రకటించాల్సి ఉంది. అలాగే ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న కేసీఆర్ కు చెందిన టీఆర్ ఎస్ పార్టీ.. బీఆర్ ఎస్ లో విలీనం అయింది.

మరోవైపు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తన పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చి, భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని తెలిపారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలుకావల్సిన అవసరం ఉందన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ ప్రారంభించిన భారత్ రాష్ట్రసమితి (బీఆర్ ఎస్) విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్లు కుమారస్వామి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..