Telangana: మహిళలకు గుడ్‌న్యూస్‌.. మార్చి 31 వరకు ఉచితంగా కంటి పరీక్షలు.. ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే..

Telangana: మహిళలకు గుడ్‌న్యూస్‌.. మార్చి 31 వరకు ఉచితంగా కంటి పరీక్షలు.. ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని అతి పెద్ద కంటి ఆస్పత్రుల నెట్‌వర్క్ డాక్టర్‌ అగర్వాల్స్ ఐ హాస్పిటిల్‌ తెలంగాణలోని తన అన్ని బ్రాంచుల్లో అన్ని వయస్సుల వారికి మార్చి 31, 2022న వరకు మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది

Basha Shek

| Edited By: Anil kumar poka

Mar 07, 2022 | 1:21 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని అతి పెద్ద కంటి ఆస్పత్రుల నెట్‌వర్క్ డాక్టర్‌ అగర్వాల్స్ ఐ హాస్పిటిల్‌ తెలంగాణలోని తన అన్ని బ్రాంచుల్లో అన్ని వయస్సుల వారికి మార్చి 31, 2022న వరకు మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. కంటి పరీక్షలు చేయించుకునేవారు 9619334129 నంబర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మహిళల్లో తలెత్తే కొన్ని రకాల కంటి వ్యాధులు, లోపాలతో పాటు ఇటీవల కాలంలో పెరుగుతున్న సమస్యలు పరీక్షించేందుకు ఆస్పత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వయస్సుతో పాటు తలెత్తే కంటిలోని రెటీనా క్షీణత, కంటిలో తలెత్తే స్వయం రక్షిత వ్యాధులు, క్యాటరాక్ట్, గ్లాకోమా, కంటిచూపు మసకబారడం, థైరాయిడ్‌ కారణంగా తలెత్తే కంటి వ్యాధులు, దృష్టి దోషాలకు సంబంధించి ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. గర్భధారణ సమయంలో చోటుచేసుకునే హార్మోన్‌ మార్పులు, మెనోపాజ్‌ ఇతర కారణాల వల్ల మహిళల్లో సంభవించే అవకాశం ఉన్న కంటి వ్యాధుల ముప్పును తగ్గించేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు.

మహిళల్లోనే అధికంగా కంటి సమస్యలు.. ఈ సందర్భంగా డా.అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ ప్రముఖ ఆప్తమాలజిస్టు డాక్టర్‌ పలక్‌ మాట్లాడుతూ.. ‘మహిళలు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పోషకాహార సప్లిమెంట్స్‌ తీసుకునే విషయంలోనూ డాక్టర్లను సంప్రదించాలి. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు యూవీ-నిరోధక సన్‌ గ్లాసెస్‌తో పాటు అంచులు ఉన్న టోపీలు ధరించాలి. కంటికి సంబంధించిన సౌందర్య సాధనాలు, కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించేటప్పుడు పరిశుభ్రమైన పద్ధతులతో పాటు జాగ్రత్తలు పాటిస్తూ కంటి ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో శరీరం ఎక్కువ నీటిని ఒడిసిపడుతుంది. ఇది కార్నియాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా పలు కంటి సమస్యలు తలెత్తుతాయిజ గర్భిణులకు గెస్టెషనల్‌ డయాబెటిస్‌ తలెత్తినప్పుడు గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడి కొంతమందికి డయాబెటిక్ రెటినోపతి, కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల దృష్టి సమస్యలు ఏర్పడతాయి. గర్భం కారణంగా కళ్లు పొడిబారడటం, కాంతిని చూస్తే తట్టుకోలేకపోవడం కూడా జరుగుతుంది. గర్భనిరోధక మాత్రలలోని హార్మోన్లు వాస్కులర్ మార్పులకు కారణమవుతాయి. ఇవి పరోక్షంగా కంటి సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి గర్భిణులు ఆకుకూరలు, పండ్లు, నట్స్‌, ఒమెగా -3 అధికంగా ఉండే చేపలను బాగా తినాలి. అన్ని సమయాల్లోనూ వారి తమ శరీరం హైడ్రేటేడ్‌గా ఉంచుకోవాలి’.

నెల రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు.. ‘ఇక ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో 80% మంది మహిళలే. లూపస్, సోరియాసిస్, రైటర్స్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యువెటిస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధుల కారణంగా తలెత్తే సమస్యల్లో కంటి వాపు కూడా ఒకటి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన కళ్లు పొడిబారడం, కండ్లకలక వాపు, కార్నియా సన్నబడటం, ఇతర బాధాకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. థైరాయిడ్ హార్మోన్‌ ఎక్కువగా స్రవించడం వల్ల సమస్యలతో కళ్ల కలక, కళ్లు పొడిబారటం, కాంతిని చూడలేకపోవడం, వాపు, కళ్లు ఎర్రబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో థైరాయిడ్ హార్మోన్‌ తక్కువగా ఉన్నట్లయితే కనురెప్పలు రాలిపోవడం, కళ్లు, ముఖం ఉబ్బడం వంటివి జరుగుతాయి. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకు ఆయుర్ధాయం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వయస్సు పైబడుతున్న కొద్ది స్త్రీలల్లో కంటి వ్యాధులు పెరిగే ముప్పు అధికంగా ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాల ఔషధాలు, మందులు మోతాదుకు మించి వాడడం కూడా కంటి సమస్యలకు ఒక కారణం. ఈక్రమంలో కంటి సమస్యలపై సంపూర్ణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోన్నాం. తెలంగాణవ్యాప్తంగా ఈ నెలరోజులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కంటి సమస్యలను త్వరగా గుర్తించేందుకు, త్వరగా చికిత్స అందించేందుకు దోహదపడుతాయని ఆశిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

Also Read:Ram Pothineni: మన ఎనర్జిటిక్ స్టార్ ఆ సినిమాలతో ఉత్తరాది ఊపేస్తాడా..?

Viral Video: పిల్లే అయినా పులిలా వేటాడింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

మీ ఫోన్​లో ఇంటర్నెట్ డేటా అయిపోయిందా..? అయితే నో ప్రాబ్లం.. ఈ ప్యాకేజీ మీకోసమే

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu