Telangana: పండుగకు వెళ్లి వస్తుండగా ఎదురొచ్చిన మృత్యు శకటం.. చిన్నారులతో సహా నలుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు బలంగా ఢీకొనడంతో దంపతులతోపాటు ఎనిమిదేళ్ల కుమార్తె, మరో బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు బలంగా ఢీకొనడంతో దంపతులతోపాటు ఎనిమిదేళ్ల కుమార్తె, మరో బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సు బీబీగూడెం శివారులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద శబ్దం రావడంతో హుటాహుటిన స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు, కారు రెండు వేగంగా రావడం, మూల మలుపు తీసుకొనే క్రమంలో కారు అదుపు తప్పి బస్సును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.
తొర్రూరు మండలం కాంటెయ్యపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34) అతని భార్య రేణుక (28), వారి కూతురు రిషిత(8) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో కారులో నుంచి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పటికే వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారు వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? బస్సు వేగంగా రావడం వల్లా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతుడు రవీందర్ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కారులో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..