KTR: పోలీసులు రిటైర్ అయినా వదలిపెట్టం – కేటీఆర్ మాస్ వార్నింగ్
రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని.. అందరికీ కేసీఆర్ గుర్తుకొస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూనే.. పోలీసులకు ఇన్‌డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఆ డీటేల్స్ తెలుసుకుందాం...

ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్లలో కేసీఆర్ చేసిన పనులనే ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దేనని జోస్యం చెప్పారు. 75ఏళ్ల దేశ చరిత్రలో కేసీఆరే నెంబర్ వన్ సీఎం అన్నారు కేటీఆర్. సీఎంగా కేసీఆర్ ఫెయిల్ కాలేదన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ మోసాల గురించి ముందే చెప్పారన్నారు. ఆయన మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో స్థానిక నాయకత్వం విఫలమైందన్నారు.
కేసీఆర్ కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. కరీంనగర్ గడ్డ.. గులాబీ పార్టీ అడ్డా అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది కరీంనగరేనన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారాయన. కార్యకర్తలను వేధించేవారి భరతం పడతామన్నారు కేటీఆర్. కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టిన పోలీసులు రిటైర్ అయినా.. విదేశాల్లో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కేసులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు కేటీఆర్. వారికి తప్పకుండా పదవులిచ్చే బాధ్యత తనదేనన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు క్యాడర్ భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆఖరికి బీఆర్ఎస్ పోరాడితేనే పంటలకు నీళ్లిచ్చిరన్నారు. రేవంత్‌కు మూటలు మోయడం తప్ప పాలన చేతకాదని విమర్శించారు కేటీఆర్. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం ఇస్తున్నామని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కార్.. 5 డీఏలు బాకీ ఉందని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..