AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: ఆయన మాట్లాడినా సంచలనం.. మాట్లాడకున్నా సంచలనమే.. కేసీఆర్ మౌనం వీడేది అప్పుడేనా?

ఆయన మాట్లాడినా సంచలనమే, మాట్లాడకున్నా సంచలనమే. అసలు, ఆయన మౌనమే ఓ భారీ కార్యాచరణను తలపిస్తుంది. మరి తెలంగాణలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంటే.. ఆయన ఎందుకు మాట్లాడట్లేదు..?

KCR: ఆయన మాట్లాడినా సంచలనం.. మాట్లాడకున్నా సంచలనమే.. కేసీఆర్ మౌనం వీడేది అప్పుడేనా?
Kcr Silence
Rakesh Reddy Ch
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 19, 2024 | 9:15 PM

Share

ఆయన మాట్లాడినా సంచలనమే, మాట్లాడకున్నా సంచలనమే. అసలు, ఆయన మౌనమే ఓ భారీ కార్యాచరణను తలపిస్తుంది. మరి తెలంగాణలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంటే.. ఆయన ఎందుకు మాట్లాడట్లేదు..? రాష్ట్ర సాధకుడిగా పేరొందిన వ్యక్తి.. ఇప్పుడెందుకిలా మౌనమునిగా మారిపోయారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురించి.. పార్టీ వర్గాల్లోనే కాదు, యావత్‌ తెలంగాణ ప్రజానీకంలో జరుగుతున్న చర్చ ఇది. ఇంతకీ ఆయన సైలెన్స్‌ దేనికి సంకేతం?

అందరికీ రాజకీయాలంటే గేమ్‌ కావొచ్చు..! కేసీఆర్‌ మాత్రం రాజకీయమంటే ఒక టాస్క్‌. ఈ మాటలు గతంలో స్వయంగా కేసీఆర్‌ చెప్పినవే. కేవలం మాటలు కాదు… రాజకీయాల విషయంలో ఆయన చేతలు కూడా అలానే ఉంటాయి. ఉద్యమ సమయం నుంచి మొన్నటి దాకా… ఆయన రాజకీయ చాణక్యం అలానే ఉండేది. ప్రత్యర్థులకు అంతుచిక్కని పదునైన వ్యూహాలతో… రాజకీయ దురంధరుడిగా పేరు గడించారు. 14ఏళ్ల ఉద్యమం నడిపి, తెలంగాణను సాధించి.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌.. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తుంటి ఎముకకు గాయం కావడం ఆయణ్ని మరింత నీరసించేలా చేసింది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా… ఇటీవల అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌కు తొలిరోజు హాజరైనా… ఆయన మునుపటిలా యాక్టివ్‌గా లేరు. తన వ్యవసాయ క్షేత్రంలోనే సేద తీరుతున్న కేసీఆర్‌, అడపాదడపా పార్టీ నేతలను కలుస్తున్నారు. కానీ, రాజకీయంగా ఆయన బయటకు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడిదే అంశం.. గులాబీ శ్రేణులను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు నిరుత్సాహపరుస్తోంది.

ఇన్నాళ్లూ ఎలా ఉన్నా… ఇప్పుడు తెలంగాణ రాజకీయం మరోసారి రగులుతోంది. అధికారపక్షంతో నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతోంది ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌. ఎమ్మెల్యేల ఫిరాయింపుల నుంచి, పీఏసీ చైర్మన్‌ పదవి వివాదాస్పదం అవడం దాకా…. రుణమాఫీ నుంచి సెక్రటేరియట్‌ ముందు రాజీవ్‌ విగ్రహ ఏర్పాటు దాకా… కాంగ్రెస్‌ను కడిగిపారేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ఎపిసోడ్‌తో.. వ్యవహారం మరింత పీక్స్‌కు చేరింది. అంశం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుడుగునా ఇరకాటంలో పెట్టేందుకు… ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు.. ప్రయత్నం చేస్తున్నారు హరీష్‌రావు, కేటీఆర్‌. వరుస ఆందోళనలతో కాంగ్రెస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

పెద్దసార్‌ స్పందించడం లేదేంటన్నదే అందరినీ తొలిచి వేస్తున్న ప్రశ్న. 14ఏళ్లు ఉద్యమాన్ని నడిపిన నాయకుడు.. 10ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన నాయకుడు.. ఇప్పుడిలా మౌనవత్రంలోకి వెళ్లడం పార్టీవర్గాలనే కాదు, సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అంశమేదైనా కేసీఆర్‌ అంటేనే ఫైర్‌… అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. కానీ, ఇప్పుడిలా కామ్‌గా ఉండిపోవడం ఆయన అభిమానులకు అస్సలు నచ్చట్లేదు. అధికారం ఉంటేనే వస్తారా? లేదంటే జనాలు అక్కర్లేదా? అనే వారూ ఉన్నారు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌నేతలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్న కేసీఆర్‌… ఆ బాధ్యతను కేటీఆర్‌, హరీష్‌లకు అప్పగించారట. అందుకే, సీఎం రేవంత్‌ విమర్శలు, ఆరోపణలు చేయడమే గాని, కేసీఆర్‌ నుంచి ఇప్పటివరకూ ఒక్క కౌంటర్‌ కూడా రాలేదు. ఇక, పార్టీని గాడిన పెట్టే బాధ్యతను కూడా హరీష్‌, కేటీఆర్‌లకే వదిలేసిన కేసీఆర్‌… వారి సత్తాకు పరీక్ష పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే, ఎవరికివారు పోటాపోటీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ముందుకెళ్తున్న బావబామ్మర్దులు కేసీఆర్‌ టాస్క్‌ను పూర్తిచేసే పనిలోనే ఉన్నారట.

అసలు, ప్రస్తుతం కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ చేస్తున్న పోరాటం కూడా… కేసీఆర్‌ దిశానిర్దేశంలోనే జరుగుతోందిట. అధినేత ఎలా చెబితే అలా ముందుకెళ్తూ… రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారట బీఆర్‌ఎస్‌ నేతలు. ఈ లెక్కన లోపల ఉంటూనే ఇంత రచ్చ చేస్తున్న కేసీఆర్‌.. ఒకవేళ నిజంగానే బయటకు వస్తే.. కాంగ్రెస్‌ వాళ్లు తట్టుకుంటారా? అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి గులాబీశ్రేణులు. అంతేకాదు, అధినేత మౌనం వెనక పెద్ద వ్యూహం లేకపోలేదని కూడా అంచనా వేసుకుంటున్నాయి. కచ్చితంగా భారీ పొలిటికల్‌ స్కెచ్‌తోనే.. ఆయన సైలెన్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారనీ.. దాంతో భారీ విస్పోటనం తప్పకపోవచ్చనే ధీమానూ వ్యక్తం చేస్తు్న్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..