AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Bus Yatra: నల్లగొండ నుండి పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన కేసీఆర్..

అసెంబ్లీ ఎన్నికలో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచి పార్లమెంట్ అవున ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట పేరుతో బస్సు యాత్రను మొదలుపెట్టారు.

KCR Bus Yatra: నల్లగొండ నుండి పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన కేసీఆర్..
Kcr In Miryalguda
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 25, 2024 | 10:34 AM

Share

అసెంబ్లీ ఎన్నికలో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచి పార్లమెంట్ అవున ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట పేరుతో బస్సు యాత్రను మొదలుపెట్టారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని బస్సు యాత్రలో కేసీఆర్ విమర్శల దాడిని కొనసాగించారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తోంది. మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర 17 రోజులపాటు కొనసాగనుంది. ఈ బస్సు యాత్ర 12 లోక్ సభ స్థానాల పరిధిలో కొనసాగుతుంది. ఈ బస్సు యాత్ర వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటకు చేరుకుంటుంది. సిద్దిపేట భారీ బహిరంగ సభతో ఈ బస్సు యాత్ర ముగియనుంది. . ఈ బస్సు యాత్రలో కేవలం రోడ్‌ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్‌ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఉదయం పూట రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలు సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. బస్సు యాత్రలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

కేసిఆర్ కు నల్లగొండ సెంటిమెంట్..

బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక ఘట్టాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికైంది. గులాబీ అధినేత కేసిఆర్ కు నల్లగొండతో సెంటిమెంట్ కలిగి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్వహించిన నల్లగొండ, కరీంనగర్, చేవెళ్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో ‘పొలంబాట’ పేరిట బస్సుయాత్ర నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌.. 2002 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ప్రథమ వార్షికోత్సవానికి నల్లగొండనే వేదికగా నిలిచింది. తొలి ప్లీనరీకి లక్ష మందితో బహిరంగసభ నిర్వహించి జిల్లాపై చెరగని ముద్ర వేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై 2003 ఆగస్టు 26న కోదాడ నుండి కేసీఆర్‌ పాదయాత్ర చేపట్టారు. నాలుగు రోజలపాటు కొనసాగిన పాదయాత్ర హాలియాలో బహిరంగసభతో ముగిసింది. 2004లో ఫ్లోరైడ్‌పై అధ్యయన కోసం కేసీఆర్‌ రెండ్రోజుల బస్సుయాత్ర చేపట్టారు. మర్రిగూడ, నాంపల్లి, చండూర్‌, నార్కట్‌పల్లి మండలాల్లో పర్యటించి ఫ్లోరైడ్‌ బాధితులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమయంలోనే గుండె నిండా ఫ్లోరైడ్‌ బండా… తల్లడిల్లే నల్లగొండ అంటూ స్వయంగా కేసీఆర్‌ పాట రచన చేశారు.

2004 ఎన్నికల్లో ఆలేరు నుంచి తొలిసారి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయం లభించింది. 2008లో నల్లగొండ వేదికగా కేంద్రంపై ఒత్తిడి కోసం ఎంపీగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్‌జీ కళాశాల వేదికగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాజీనామా పత్రాలు అందించారు. 2014లో కేంద్రం ప్రకటన అనంతరం సూర్యాపేటలో సమరభేరి సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తుంటి ఎముక శస్త్ర చికిత్స తర్వాత తొలిసారిగా నల్లగొండలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. రాజకీయంగా కేసీఆర్ కు బాగా కలిసి వచ్చిన నల్లగొండ జిల్లా నుంచి ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడం ఆనవాయితీగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…