AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender: మాజీ మంత్రి ఈటల దారెటు..? సొంత పార్టీ పెడతారా..? కాషాయకండువా కప్పుకుంటారా..?

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఐతే గత కొద్ది రోజులుగా కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Etela Rajender: మాజీ మంత్రి ఈటల దారెటు..? సొంత పార్టీ పెడతారా..? కాషాయకండువా కప్పుకుంటారా..?
Balaraju Goud
|

Updated on: May 27, 2021 | 9:08 AM

Share

Etela Rajender to Join BJP: మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఐతే గత కొద్ది రోజులుగా కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం గూటికి వెళ్తారని వార్తలొస్తున్నాయి. అయితే, తాను ఏ పార్టీలో చేరడం లేదని..మద్దతు కూడగొట్టేందుకే ఇతర పార్టీల నేతలను కలుస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని అంటున్నారు. అయితే తాజా పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

ఈటల రాజేందర్ బీజేపీ గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే దిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డాతో ఆయన భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. గురువారమే దిల్లీకి వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. ముందే ప్రకటించిన విలేకరుల సమావేశాన్ని అందుకే రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వర్గాలు మూడునాలుగు రోజుల్లోపే చేరిక ఉంటుందని చెబుతున్నాయి. ఈటలతో పాటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రమేష్‌ రాథోడ్‌ సైతం కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఈటల రాజేందర్ సొంతంగా కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన ఫేస్‌బుక్‌లో ఫొటోను మార్చారు. అందులో పిడికిలి ఎత్తిన గుర్తుతో పాటు కాషాయ రంగు తెలంగాణ చిత్రపటం, బ్యాక్‌గ్రౌండ్‌లో నీలి, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఈ క్రమంలో ఈటల కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది. అది బీసీల వేదికగా ఉండబోతుందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటి వరకూ అలాంటి సంకేతాలేవీ ఈటల వర్గం నుంచి రాలేదు.

ఇదిలావుంటే, కొద్దిరోజులుగా బీజేపీ కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా ఈ మంతనాలలో వివేక్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘బీజేపీలో చేరితే మీ పోరాటానికి పార్టీ అండగా ఉంటుంద’ని ఛుగ్‌ చెప్పినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ‘సంఘ్‌’ కీలక నేతతోనూ రాజేందర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌, బీజేపీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని తొలుత భావించారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలతో కొద్దిరోజులుగా విడివిడిగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. బీజేపీ నేతలు.. తమ పార్టీలో చేరాలని, ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాము మద్దతు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అనంతరం కాషాయం గూటికి చేరిక వ్యవహారం కొలిక్కివచ్చినట్లు బీజేపీ వర్గాల సమాచారం. ‘‘పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్‌ ఖరారు కాగానే ఈటల ఢిల్లీ వెళ్లి కలుస్తారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా ఎప్పుడన్నది జాతీయ నాయకత్వంతో మాట్లాడాక స్పష్టత వస్తుంది’’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. నడ్డాకు ఈటల బయోడేటాను రాష్ట్ర పార్టీ పంపించింది.

ఇదిలావుంటే, ఈటల భారతీయ జనతా పార్టీలో చేరాలా, వద్దా అనే విషయమై తన మద్దతుదారుల అభిప్రాయాల్ని మరోమారు అడిగినట్లు తెలిసింది. బుధవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మద్దతుదారులు ఈటలను శామీర్‌పేటలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను దీటుగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు అడుగులేస్తే బాగుంటుందనే భావనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి పలువురు నాయకులు సమ్మతించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

Read Also… Antibodies Cocktail: సత్ఫలితాలిస్తున్న కోవిడ్ డ్రగ్.. యాంటీబాడీస్ కాక్‌టైల్‌.. భారత్‌లో ఐదు రోజులకే కోలుకున్న వృద్ధుడు