Telangana Cabinet: ఈనెల 30న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. లాక్‌డౌన్ పొడిగిస్తారా? సడలిస్తారా?
తెలంగాణలో కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 30న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Telangana Cabinet Meeting: తెలంగాణలో కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడంలేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్నారు. మే 30 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆ తర్వాత ఏంటి? లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? లేదంటే కరోనా కేసులు తగ్గాయని సడలింపులు ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మే 30న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది.
రాష్ట్రంలో ఆంక్షల సడలింపు సమయం పెంచి లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 30న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. లాక్‌డౌన్, వానాకాలం పంటల ప్రణాళిక సహా పలు కీలక అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం. మరోవైపు, కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో ఆంక్షలను మరికొంత కాలం పొడిగిస్తే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఈ మంత్రి మండలి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు, బ్లాక్‌ఫంగస్ పరిణామాలతో పాటు వాటికి చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్ పరీక్షల పెంపు, ఆక్సిజన్ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ రంగానికి సంబంధించి ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. ఇంటింటి జ్వర సర్వే, లక్షణాలున్న వారికి కిట్ల పంపిణీని సమీక్షిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైద్య ఆరోగ్య, హోంశాఖలకు బడ్జెట్ పెంచుతామని, కొన్ని శాఖలకు తగ్గిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసే అవకాశముంది.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ వైద్యులు ఏటా సమ్మె చేస్తున్నందున వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్ల పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు జూడాలు తప్పనిసరిగా అక్కడ పనిచేయాలనే కేంద్ర నిబంధనల అమలు గురించి కూడా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే, రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నీటి లభ్యత కారణంగా ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని, కోటీ 40 లక్షల ఎకరాలకు పైగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వానాకాలం పంటల ప్రణాళికను మంత్రిమండలి ఖరారు చేయనుంది. నీటి వినియోగం, వరితో పాటు ఇతర పంటలు ఎంత మేరకు సాగు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు మరింత కఠిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ధాన్యం కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. కాగా, జూన్ నుంచి వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కానుంది. పంటల సాగు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు పెద్దఎత్తున జరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్‌లో సడలింపు సమయాన్ని మరికొన్ని గంటలు పెంచే అవకాశముంది.
Read Also…. Cyclone Yaas: యాస్ తుపాను బీభత్సకాండ.. సునామీలా విరుచుకుపడ్డ ప్రకృతి ప్రళయం.. కోటిమందిపై ప్రభావం..!