Andhra: దండలు మార్చుకొని.. ఏడడుగులు నడిచే గడియల్లో విగతజీవిగా మారిన వరుడి విషాద గాథ
విజయనగరం దాసన్నపేట యాదవవీధిలో విషాదం నెలకొంది. మరికొద్ది గంటల్లో దండలు మార్చుకోవాల్సిన 25 ఏళ్ల వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బీకాం పూర్తి చేసి కార్పొరేట్ సంస్థలో క్యాషియర్‌గా పనిచేస్తున్న వీరేంద్ర, చిన్నప్పటి స్నేహితురాలినే ప్రేమించి, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే..

విజయనగరం దాసన్నపేట యాదవవీధిలో విషాదం చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో దండలు మార్చుకోవాల్సిన వీరేంద్ర అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. 25 ఏళ్ల వీరేంద్ర బీకాం పూర్తి చేసి ఓ కార్పొరేట్ సంస్థలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఓ యువతితో స్నేహం ఉంది. ఆ స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారింది. కలిసిమెలిసి సరదాగా ఉండేవారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో సరేనని అంగీకరించారు. అలా ఇరు కుటుంబాలూ వారి ప్రేమ పెళ్లిని అంగీకరించాయి. అయితే ప్రస్తుతం మూఢం కారణంగా మంచి రోజులు లేకపోవడంతో తాత్కాలింగా పెళ్లి నిర్ణయం వాయిదా వేసుకోవాలని ఇద్దరికి చెప్పారు కుటుంబసభ్యులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 తర్వాతే ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ యువతి మాత్రం అందుకు ససేమిరా అంది. అంత వరకు వేచి ఉండకుండా వెంటనే పెళ్లి కావాలని పట్టుబట్టింది. దీంతో వారం రోజులు పాటు ఇరు కుటుంబాల మధ్య చర్చలు, యువజంట మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. చివరికి శుక్రవారం ఉదయం సింహాచలం దేవస్థానంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకోవాలని యువజంట నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మనస్తాపానికి గురైన వీరేంద్ర ఇంటిమీద ఉన్న తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఎప్పటిలాగే తెల్లవారిన తరువాత శుక్రవారం ఉదయం ఇంట్లోకి వెళ్లి చూసే సరికి కుమారుడు వీరేంద్ర విగతజీవిలా మారి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు.అంతా సవ్యంగా జరుగుతుందని ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో కొన్ని క్షణాల్లోనే దుఃఖం అలముకుంది. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడం, మూడం నడుస్తుండటంతో ఇవి మంచి రోజులు కావు, కొద్ది రోజులు ఆగి మంచి రోజులు చూసి మేమే పెళ్లి చేస్తామని ఇరు కుటుంబాల పెద్దలు ఆ జంటకు చెప్పారు. అయితే అందుకు యువతి మాత్రం అందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. మరో మూడు నెలలు పాటు పెళ్లి చేసుకోవడం కుదరకపోతే ఇంట్లో పెద్దల మనసు మారి మన పెళ్లికి అడ్డుపడొచ్చు, కాబట్టి మనం మంచి రోజులు చూసి ప్రేమించుకోలేదు కదా.. పెళ్లికి కూడా మంచి రోజులు అవసరం లేదు.. మనిద్దరం కలిసిన క్షణాలే మంచి రోజులు కాబట్టి వెంటనే పెళ్లి చేసుకుందామని యువకుడిపై యువతి ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. అయితే వీరేంద్ర ఇంటి పెద్దలను కాదని వారి మనసును బాధపెట్టి పెళ్లి చేసుకోవటం తగదని కొద్ది రోజులు వేచి చూద్దామని యువతకి చెప్పినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అలా ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో వీరేంద్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ముందుగా సింహాచలం ఆలయంలో శుక్రవారం ఇద్దరు కలిసి దండలు మార్చుకొని పెళ్లి చేసుకుందామని ఇరువురు భావించారు. అయితే వీరేంద్ర ముందు అంగీకరించినా కుటుంబ సభ్యుల నిర్ణయం కాదని వారిని బాధపెట్టడం ఇష్టం లేక యువతిని కన్విన్స్ చేసే క్రమంలోనే ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగి బలవన్మరణానికి దారి తీసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రేమ, పెళ్లికి కుటుంబాలు అంగీకరించిన కుటుంబాల్లో క్షణికావేశం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
