Hyderabad: అలా బైక్‌పై వెళ్తుంటే.. ఇలా మెడ తెగిపోయింది… సెకన్లలో ఏం జరిగిందంటే..?
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రోడ్లపై తిరిగే ప్రజలు ప్రాణాలు అరచేతితో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే కంటికి కనిపించని కొన్ని చైనా మంజాలు జనాల ప్రాటిట మృత్యువుగా మారుతున్నాయి. వాటి బారీ నుంచి తప్పించుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అవి వెంటాడడం మాత్రం ఆపట్లేదు.. ఇక సంక్రాంతికి ఇంకా నెల రోజుల ముందే హైదరాబాద్ నగరంలో వీటి వేట మొదలైంది. తాజాగా గుర్రంగూడకు చెందిన ఒక వ్యక్తి మాంజా దారం తగిలి ప్రమాదానికి గురయ్యాడు. సకాలంలో వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

సంక్రాంతికి ఇంకా దాదాపు 40 రోజులకు పైగా ఉన్నా ఇప్పటి నుంచే మాంజా ప్రమాదాలు మొదలైపోయాయి. తాజాగా నగరంలోని గుర్రంగూడ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఇంటి నుంచి నాగోలు వైపు తనకు కాబోయే భార్యతో కలిసి బైకు మీద వెళ్తుండగా ఉన్నట్టుండి మెడకు ఏదో తట్టుకున్నట్లు అయ్యింది. ఎంటా అని ఆపి చూసేలోపే అతని మెడ తెగిపోయింది. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి అతడిని గమనించి వెంటనే సమీపంలో ఉన్న కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కార్తీక్‌కు పరీక్షించిన వైద్యులు అతడి రక్తనాళాలు తెగిపోయినట్టు గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేసి రక్తనాళాలు తిరిగి అతికించారు.
కార్తీక్ తనకు కాబోయే భార్యతో కలిసి వెళ్తుండగా కామినేని ఫ్లై ఓవర్ ఎక్కిన కాసేపటికి అతడి మెడకు మాంజా చుట్టుకుంది. హెల్మెట్ పెట్టుకున్నా కూడా మెడ భాగంలో అది గట్టిగా కోసుకుంది. దాంతో అతడి మెడ కండరాలతో పాటు, పైవైపు ఉండే రక్తనాళాలు కూడా తెగిపోయాయి. అయితే అదృష్టవశాత్తు లోపలి భాగంలో ఉండే ప్రధాన రక్తనాళాలు కాని, శ్వాసనాళం కాని గాయపడకపోవడంతో అతడికి మరీ ఎక్కువగా ఇబ్బంది కలగలేదు. అయితే, రక్తనాళం తెగడంతో రక్తస్రావం ఎక్కువగా ఉంది. ఆస్పత్రికి తీసుకురాగానే ముందు ఎమర్జెన్సీలో రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అరగంటలోపే శస్త్రచికిత్స ప్రారంభించి అతడికి తెగిపోయిన రక్తనాళాలను తిరిగి అతికించడంతో పాటు.. కండరాన్ని కూడా కుట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. మాంజాను చేత్తో తీయడానికి ప్రయత్నించడంతో అతడి చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయి. అతడితో పాటు వెనక కూర్చున్న యువతికి మెడ దగ్గర, కంటి దగ్గర స్వల్ప గాయాలు అయ్యాయి.
సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటినుంచే పతంగులు ఎగరేయడం మొదలైంది. అయితే, అవి తెగిపోయినప్పుడు వాటికి వాడుతున్న మాంజాలు కూడా తెగిపోయి.. గాలికి వేలాడుతూ ఇలా రోడ్డు మీద వెళ్లేవాళ్ల ప్రాణాలను తీస్తున్నాయి. వీటిలో వివిధ రకా గాజు పూసిన మాంజాలు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. వీటి నియంత్రణకు ఇప్పటినుంచే అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం ఉంటుంది అని డాక్టర్ రిషిత్ బత్తిని తెలిపారు.
కాపాడింది కూడా కామినేని వైద్యుడే
తనను ఈ ప్రమాదం నుంచి కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లినది కూడా కామినేని ఆస్పత్రికి చెందిన వైద్యుడేనని బాధితుడు కార్తీక్ తెలిపారు. ‘‘నేను నాకాబోయే భార్యతో కలిసి నాగోలు వైపు వెళ్తున్నాను. 40 కిలోమీటర్లలోపు వేగంతోనే వెళ్తుండగా ఉన్నట్టుండి ఏదో కోసుకున్నట్లు అనిపించింది. చెయ్యి పెట్టి చూసేసరికి హెల్మెట్ లోపల నుంచి మాంజా కనిపించింది. అది తగిలిచెయ్యి కూడా కోసుకుపోయింది. వెంటనే బండి పక్కకి తీసి ఆపేశాను. తర్వాత మెడదగ్గర నొప్పి ఉంది ఏంటా అని చెయ్యి పెడితే చెయ్యి అంతా రక్తం ఉంది.
ఈలోపు అటుగా వచ్చిన వైద్యుడు తన కర్చీఫ్ ఇచ్చి అదిమిపట్టుకోమన్నారు. రెండు మూడు ఆటోలు ఆపినా ఆగలేదు. దాంతో ఆయన తన బండి మీద దగ్గర్లో ఉన్నకామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను. తర్వాత అరగంటకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. నన్ను ఆస్పత్రిలో చేర్చింది కూడా ఒక వైద్యుడే అని తర్వాత తెలిసింది. ఇంకా సంక్రాంతికి చాలా సమయం ఉన్నా ఇప్పటినుంచే ఇలా మాంజాలు తగలడం మొదలైతే రోడ్ల మీద వెళ్లేవారికి చాలా ప్రమాదం ’’ అని కార్తీక్ చెప్పారు.

Hyderabad
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
