Telangana: విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.. భారీ వర్షాలు, వరదలతో ప్రభుత్వం అప్రమత్తం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఊరూ - ఏరూ ఏకమైంది. ఏ మాత్రం విరామం ఇవ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఊరూ – ఏరూ ఏకమైంది. ఏ మాత్రం విరామం ఇవ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు పొడిగించింది. అయినప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా ప్రకటించిన విధంగా అయితే తెలంగాణలో విద్యా సంస్థలు (Schools) రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం, వాగులు ఉప్పొంగుతుండటం, ఇంకా వర్షాలు ఉన్నాయన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది.
భారీగా కురుస్తోన్న వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవేళ వర్షాలు తగ్గుముఖం పట్టిన వాగులు మాత్రం పొంగి పొర్లడం ఖాయం. ఈ కారణంగానే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లను దిగ్బంధించాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అల్లాడుతున్నారు.
కాగా.. బుధవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, నగరవాసులు అప్రమత్తంగా వుండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్న బలమైన గాలుల వల్ల సిటీలోని కాలనీల్లో చెట్లు విరిగిపడే ప్రమాదం వుందని జీహెచ్ఎంసీ చెబుతోంది. బలమైన గాలుల కారణంగా కాలనీల్లో చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అవసరమైతే మినహా జంట నగరాల జనం బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడొద్దని అంటున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..