Telangana: రోజూ సమాధి దగ్గర నిద్రపోతున్న శునకం.. అనుమానమొచ్చి ఆరా తీయగా..
ప్రతి రోజు సమాధి చుట్టూ ఓ శునకం తిరుగుతోంది. యాజమాని చనిపోవడంతో కుక్క తట్టుకోలేకపోయింది. నిత్యం సమాధి వద్దనే గడుపుతోంది. ఎన్ని సార్లు ఇంటికి పంపినా.. మళ్లీ సమాధి దగ్గరికి వచ్చి.. విషాదంగా కూర్చుంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.

కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. బుక్కెడు అన్నం పెట్టిన యజమానితో పాటు ఆ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. అందుకే అనేక మంది సొంత మనుషుల మీద కాకుండా కుక్కల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. యజమాని ఆపదలో ఉన్నాడని అందరికన్నా ముందు పసిగట్టేది ఆ ఇంటి కుక్కే. ఆపద సమయంలో తనకేమైతుందనేది చూసుకోకుండా యజమానిని కాపాడేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. అలాంటి ఓ పెంపుడు కుక్క.. తనను పెంచుతున్న యాజమాని చనిపోతే.. అతడి అంత్యక్రియల్లో పాల్గొని సమాధి వద్ద తిరుగుతూ, ఆ కుటుంబ సభ్యుల్ని కంటతడి పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య అనే వ్యక్తి ఇటీవలే కారు ఢీకొన్న ఘటనలో చనిపోయాడు. శునకానికి రాజు అనే పేరు పెట్టుకున్నాడు. మృతుడు కొమురయ్య కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కొమురయ్య ఇంట్లోంచి బయటకు ఎటు వెళ్లినా కూడా అతడితో పాటే వెళ్లేది శునకం. అయితే కొమురయ్య చనిపోవడంతో యజమాని కోసం సమాధి వద్దనే వేచి చూస్తోంది ఆ శునకం.
సమాధి పక్కనే ఉన్న పాడే కట్టెల వద్ద కూర్చుని తన యజమాని కొమురయ్య ఎప్పుడు వస్తాడని దీనంగా ఎదురుచూస్తోంది. దీంతో కొమురయ్య కుటుంబ సభ్యులు విశ్వాసం గల శునకాన్ని చూసి కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఆస్తుల కోసం కొట్టుకుని, చంపుకునే ఈ రోజుల్లో మనుషుల కంటే జంతువులే నయమని నిరూపిస్తోంది రాజు అనే ఈ శునకం. అంతేకాకుండా అంత్యక్రియల్లో మొత్తం ఈ శునకం పాల్గొంది. మూడు రోజుల నుంచి సమాధి వద్దనే ఉంటుంది. అన్నం పెట్టినా కుక్క తినడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి