Telangana: రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో నయా మోసం
హైదరాబాద్‌లో డెలివరీ ఛార్జీల పేరుతో కొత్త సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యక్తి డీహెచ్‌ఎల్ కొరియర్ స్కామ్‌లో రూ.2.49 లక్షలు కోల్పోయాడు. ఒక్క లింక్‌తో కేటుగాళ్లు అకౌంట్ ఖాళీ చేశారు. ఫెయిల్డ్ డెలివరీ SMS లింక్‌లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్‌లో సైబర్ మోసాలు ఆందోళణ కలిగిస్తున్నాయి. డెలివరీ ఫీజు చెల్లిస్తున్నానని భావించి బంజారాహిల్స్‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ. 2.49 లక్షలు కోల్పోయాడు. కొరియర్ కంపెనీ ముసుగులో నేరగాళ్లు ఈ కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. బాధితుడు డీహెచ్‌ఎల్ కొరియర్ కోసం ఎదురుచూస్తుండగా ఈ మోసం జరిగింది. డిసెంబర్ 2న ఉదయం 11.30 గంటలకు అతనికి గుర్తు తెలియని నంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో “మీ డెలివరీ ప్రయత్నం రెండు సార్లు విఫలమైంది. వెంటనే రీ-డెలివరీ ఛార్జీ కింద రూ.25 చెల్లించండి” అంటూ ఒక లింక్ ఉంది.
ఈ మెసేజ్ డీహెచ్‌ఎల్ నుంచే వచ్చిందని నమ్మిన బాధితుడు ఆ లింక్‌ను ఓపెన్ చేసి తన క్రెడిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేశాడు. రూ.25 చెల్లింపు కోసం వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేయగానే బాధితుడి అకౌంట్ నుండి ఏకంగా రూ. 2,49,000 భారీ మొత్తం ట్రాన్సాక్షన్ అయింది. దీంతో షాక్‌కు గురైన బాధితుడు మోసపోయినట్లు గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల హెచ్చరికలు..
ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి సైబర్ మోసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫెయిల్డ్ డెలివరీ, రీడెలివరీ ఫీజు పేరుతో వచ్చే SMS లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. అపరిచిత లింక్‌లలో క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ లేదా ఓటీపీలను ఎప్పుడూ ఇవ్వకూడదని చెప్పారు.
సైబర్ మోసం జరిగితే ఏమి చేయాలి?
సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు
హెల్ప్‌లైన్: వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.
ఆన్‌లైన్ ఫిర్యాదు: www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలి.
అత్యవసర కాంటాక్ట్: అత్యవసర సందర్భాల్లో 8712665171 నంబర్‌కు కాల్ లేదా వాట్సాప్ పంపవచ్చని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




