Munugode By Poll: మునుగోడు బైపోల్ ప్రచారానికి వెళ్లను.. అందుకేనంటూ ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ ఎస్, బీజేపీకి చెందిన గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ లో నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తూనే..
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ ఎస్, బీజేపీకి చెందిన గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ లో నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తూనే ఉంది. భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్తారని హస్తం పార్టీ నాయకులు భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మునుగోడు ప్రచారానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. తాను హోంగార్డునని, ఎస్పీ స్థాయి వాళ్లు మునుగోడుకు వెళ్తారంటూ రేవంత్ రెడ్డి పరోక్షంగా చురకలు అంటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. దీంతో తమ్ముడికి వ్యతిరేకంగా అన్నయ్య వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారా అనేది పెద్ద ప్రశ్నగా ఉండేది.
నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారంలో అన్ని పార్టీలు నిమగ్నమైన సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున మునుగోడులో ప్రచారం చేయబోనని తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారని హస్తం పార్టీ నాయకులకే నమ్మకం లేదు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటరెడ్డితో ప్రచారం చేయించి, తమ్ముడి నిర్ణయాన్ని సొంత సోదరుడే సమర్థించడం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను ప్రచారానికి వెళ్లబోనని స్పషంం చేశారు.
టీఆర్ ఎస్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజీగా ఉన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం మునుగోడు కు ఏమి ఇవ్వలేదని, తాను రాజీనామ చేయకపోతే మునుగోడు గురుంచి ఎవరూ మాట్లాడే వారు కాదన్నారు. తన రాజీనామా తో మంత్రులు ,ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి క్యూ కడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తే ఒక ఉప ఎన్నిక కోసం వంద మంది కౌరవులు సైన్యo ఎందుకని ప్రశ్నించారు. అధికారంతో బెదిరింపులకు పాల్పడి ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పుతున్నారని టీఆర్ ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. అవినీతి సొమ్ముతో తనను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ అన్నారని, అంటే టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డమ్మీ నా అని ప్రశ్నించారు. మునుగోడు లో గెలిస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా నే అంటూ హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు మీదే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..