AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోక్‌సభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గమే ‘హాట్ సీట్’.. కాంగ్రెస్ నుంచి రేసులో బడా నేతలు..

కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. ఖమ్మం సీటు కోసం ముఖ్య నేతలు మధ్య పోటీ మొదలయ్యింది. ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం హాట్ సీట్‌గా మారింది. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, వి హనుమంత్ రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

Telangana: లోక్‌సభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గమే 'హాట్ సీట్'.. కాంగ్రెస్ నుంచి రేసులో బడా నేతలు..
Congress Party
N Narayana Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 02, 2024 | 5:27 PM

Share

కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. ఖమ్మం సీటు కోసం ముఖ్య నేతలు మధ్య పోటీ మొదలయ్యింది. ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం హాట్ సీట్‌గా మారింది. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, వి హనుమంత్ రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే టికెట్ నాదే అంటూ రేణుకా చౌదరి ప్రకటన చేయడంతో.. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసింది. సోనియా పోటీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే నేతల మధ్య టికెట్ పోటీ నడుస్తోంది. ఎవరికి దక్కేనో అనే ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సునామీ సృష్టించింది.10 సీట్లకు 9 స్థానాలు కాంగ్రెస్, సీపీఐ గెలుచుకున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ 7 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఖమ్మం మరోసారి కాంగ్రెస్ కంచుకోట అని నిరూపించింది. గెలుపొందిన ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం జిల్లాకు కేబినెట్‌లో ప్రాధాన్యత కూడా కల్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కేబినెట్‌లో స్థానం దక్కింది. ముగ్గురు కీలక నేతలు సమిస్థి కృషితో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్‌కు బలమైన ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తే.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని.. ఈ ప్రభావం మిగిలిన సెగ్మెంట్‌లపై పడి.. పార్టీకి కలిసి వస్తుందనే అంచనా వేస్తున్నారు. అయితే సోనియా గాంధీ పోటీ చేసే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు.

ఖమ్మం టికెట్ నాదే అని.. టికెట్ అడిగే హక్కు తనకే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఇప్పటికే ప్రకటించడంతో.. టికెట్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. గతంలో ఖమ్మం ఎంపీగా గెలుపొంది.. కేంద్ర మంత్రిగా పని చేశారు రేణుకా చౌదరి. మరోసారి ఖమ్మం నుంచి పోటీ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తరపున ఖమ్మం కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేశారు. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. సీనియర్ నేత వి హనుమంత్ రావు కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో ముఖ్య నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు గెలుపు బాధ్యతలు మంత్రి పొంగులేటిపైనే కాంగ్రెస్ అధినాయకత్వం పెట్టినట్లు తెలుస్తోంది. తన సోదరుడికి టికెట్ ఇస్తే గెలుపు బాధ్యత తనదేనని.. అవకాశం ఇవ్వాలని పొంగులేటి సోదరులు కోరుతున్నారు. వీరే కాకుండా మరికొందరు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.