Telangana: అమెరికాలో బిజీబిజీగా సీఎం రేవంత్ అండ్ టీమ్.. పలు కంపెనీలతో ఒప్పందాలు

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది.11 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది.

Telangana: అమెరికాలో బిజీబిజీగా సీఎం రేవంత్ అండ్ టీమ్.. పలు కంపెనీలతో ఒప్పందాలు
CM Revanth Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 04, 2024 | 5:06 PM

అమెరికాలోని న్యూయార్క్‌లో సీఎం రేవంత్‌ బృందానికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లో జరగబోయే కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. 11రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు అమెరికా బయలుదేరివెళ్లగా… సోమవారం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యూఎస్‌ వెళ్లబోతున్నారు. వీరిద్దరు సీఎం బృందంతో కలుస్తారు. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.

న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటన

ఈ నెల తొమ్మిది వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. ఈ నెల 5న న్యూయార్క్‌లోని కాగ్నిజెంట్, ఆర్సీఎం, టిబిసి, కార్నింగ్, జోయిటస్ సహా పలు సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. 6న పెప్సికో, హెచ్‌సిఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళతారు.

ఐటీ కంపెనీల రౌండ్‌ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్

వాషింగ్టన్‌లో ఐటీ సేవల సంస్థలు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు. 8న కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్ యూనికారన్స్ ప్రతినిధులతో మాట్లాడతారు. సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలోనూ సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో సిఎం రేవంత్ భేటీ ఉండనుంది. స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్‌ను సీఎం రేవంత్ సందర్శిస్తారు. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈఓ, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను సీఎం రేవంత్ కలుస్తారు. ఈ నెల 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా సియోల్‌కు చేరుకుంటారు. 12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్తోతో సీఎం భేటీ ఉంటుంది. 14న రేవంత్ బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతుంది. దక్షిణ కొరియా పర్యటనలో సామ్‌సంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరపనుంది.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో రేవంత్‌ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీలకతీతంగా తెలంగాణ అభివృద్ధి ముఖ్యమన్నారు కేటీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..