CM KCR: బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ తగదాలు.. మౌనం వీడని సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ గీత దాటే ధైర్యం చేయరు అనే టాక్ ఉంది. పార్టీ గెలిచినా.. మెజారిటీ వచ్చిన, అసలు ప్రచారం చేయాలన్నా అంతా ఆయనే. ఇక పార్టీలో ఎవరైనా తోక జాడిస్తే వెంటనే కట్ చేసి పడేస్తారు. ఉవ్వెత్తున కొనసాగిన ఉద్యమంలో కూడా... సింపుల్ గా నరేంద్ర, విజయశాంతి లాంటి నేతలని పక్కన పెట్టారు.
బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ గీత దాటే ధైర్యం చేయరు అనే టాక్ ఉంది. పార్టీ గెలిచినా.. మెజారిటీ వచ్చిన, అసలు ప్రచారం చేయాలన్నా అంతా ఆయనే. ఇక పార్టీలో ఎవరైనా తోక జాడిస్తే వెంటనే కట్ చేసి పడేస్తారు. ఉవ్వెత్తున కొనసాగిన ఉద్యమంలో కూడా… సింపుల్ గా నరేంద్ర, విజయశాంతి లాంటి నేతలని పక్కన పెట్టారు. అలాంటిది బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు, పార్టీ వీడుతున్న నేతల పట్ల కొద్ది కాలంగా ఆయన మౌనంగా ఉంటున్నారు. మొన్నటి వరకి పార్టీలో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి, జూపల్లి ఇతర పార్టీలోకి వెళ్తున్నారని… పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో వ్యతిరేకత ఉన్నారని తెలిసిన చివరి నిమిషం వరకు వారిని సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బహిరంగంగా పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. ఏకంగా కాంగ్రెస్ కండువా వేసుకొని మరి ప్రెస్ మీట్ పెట్టారు. అయినా ఇప్పటివరకు చర్యలు లేవు. అనేక నియోజకవర్గాల్లో పార్టీ లైన్ దాటి గ్రూప్ వార్ లు జరుగుతున్నాయి. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశం.
20 నుంచి 25 నియోజకవర్గాల్లో సిట్టింగులు ఉన్నా.. టికెట్లు ఆశిస్తున్నా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు,ఇష్ట రాజ్యంగా పర్యటనలు చేస్తున్నారు. సిట్టింగ్ కాదని తమకే టికెట్ అని బహిరంగంగా చెప్పుకుని తిరుగుతున్నారు. అయినా కూడా కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. ఇక మరి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ లో మాకు సీటు ఖాయమని అనుచరులతో చెప్పుకుంటున్నారు. కొంతమంది బీజేపీతో ఒప్పందాలు కుదురుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ ఇంటలిజెంట్ సమాచారం ద్వారా అధినేతకు తెలిసే ఉంటుంది. అయితే కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఉంటుందని అందరూ చెప్తున్నారు. కానీ ఆలస్యం అయితే అసలుకే మోసం వస్తుందనే విషయం కూడా రాజకీయాల్లో వర్తిస్తుంది. ఈ గ్రూప్ తగాదాలు మితిమీరితే అధినేత రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కేసీఆర్ లాంటి కాకలు తీరిన రాజకీయ నేతకు తెలియని విషయం కాదు కానీ ఆయన వ్యూహం ఏంటి అనేది అర్థం కాని అంశంగా తెలుస్తోంది.
( రిపోర్టర్: రాకేష్ చీఫ్ రిపోర్టర్, టీవీ9 )