Telangana: ఎమ్మెల్యే రాజయ్యకు సవాలు విసిరిన కడియం శ్రీహరి..
స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజయ్య పార్టీ సరిహద్దు లైన్ దాటి మాట్లాడుతున్నప్పటికీ మీరు తొందరపడకండని పార్టీ పెద్దలకు తనకు చెప్పారని కడియం తెలిపారు.

స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజయ్య పార్టీ సరిహద్దు లైన్ దాటి మాట్లాడుతున్నప్పటికీ మీరు తొందరపడకండని పార్టీ పెద్దలకు తనకు చెప్పారని కడియం తెలిపారు. అందుకే తాను రాజయ్యపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఉన్నానని పేర్కొన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాజయ్య తీరుపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లో జరిగిన సమావేశంలో రాజయ్య తనపై తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు. అది చూశాక ఆయన విమర్శలపై వివరణ ఇవ్వకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారనే ఉద్దేశంతో అసలు విషయం చెబుతున్నానని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పేర్కొన్నారు.
రాజయ్య వైద్యుడై ఉన్నప్పటికీ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని కడియం విమర్శించారు. నా తల్లి కులం, నా కులం గురించి సైతం మాట్లాడటం దారుణమన్నారు. తాను నోరు విప్పితే రాజయ్య కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటని ఆరోపించారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. నా బిడ్డను చూసి రాజయ్య భయపడుతున్నారని.. గెలిచే అవకాశం ఉన్నవారికి పార్టీ అవకాశం ఇస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాజయ్య ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కోరారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు.



