Telangana Caste Politics: తెలంగాణకు కులగజ్జి సోకిందా..? నెక్ట్స్ లెవల్‌కు చేరిన కులాల కుంపట్లు..

ఈ మధ్య పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి తెలంగాణలో కుల రచ్చ మరో లెవెల్ కు వెళ్లిపోయింది. ముఖ్యంగా రెడ్లకు సంబంధించిన ఒక సమావేశానికి వెళ్లిన సమయంలో ఆయన రెడ్డిల గొప్పతనాన్ని పొగిడే క్రమంలో చేసిన కామెంట్లు రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి.

Telangana Caste Politics: తెలంగాణకు కులగజ్జి సోకిందా..? నెక్ట్స్ లెవల్‌కు చేరిన కులాల కుంపట్లు..
Revanth Reddy Vs Malla Reddy
Follow us
TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: May 30, 2022 | 5:23 PM

Telangana News: అవును…గత కొద్దికాలంగా తెలంగాణలోనూ కులాల పంచాయతీలు తెరమీదికి వస్తున్నాయి. నిజానికి తెలంగాణలో కులాల కుంపట్లు చాలా తక్కువ. దేశమంతా బ్రిటిష్ పాలన కింద ఉంటే తెలంగాణ(Telangana) ప్రాంతం మాత్రం అప్పట్లో నిజాం పాలన కింద ఉండేది. అందుకేనేమో పూర్తిగా తెలుగు గడ్డే అయినప్పటికీ ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతులు భిన్నంగానే ఉంటాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్ర, ఇటు తెలంగాణలో కలిసి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ సంప్రదాయాలను అలాగే కాపాడుకుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ అటు ఆంధ్రలోని మూడు ప్రాంతాల్లో నిత్యం కుల విధ్వేషాలు, కుల రాజకీయాలు కొనసాగుతున్నప్పటికీ ఆ జబ్బు తెలంగాణకు అంటలేదు. ఆంధ్రాలో ఇప్పటికీ చాలా చోట్ల మీరు ఏమిట్లు అని అడుగుతుంటారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల చాలామంది ఫలానా కులమైతేనే మేం.. అద్దెకు ఇస్తామని బోర్డులు పెడుతుంటారు. వనభోజనాల పేర్లతో ఆంధ్రాలో ఇప్పటికీ కుల మీటింగులు జరుగుతూనే ఉంటాయి. అలాగే కుల కార్పోరేషన్లు కూడా ఎక్కువే. కానీ తెలంగాణలో ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు. తెలంగాణలో కులాల రొచ్చులోకి ఎప్పుడూ దిగలేదు. ఎన్నికల సమయంలో కూడా కులాల పేర్లతో ఓటర్లను విభజించి వారి ఓట్ల కోసం కుల నాయకులకు గేలం వేసే పరిస్తితి తెలంగాణలో పెద్దగా కనిపించేది కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది..

రెడ్ల పంచాయతీ..

ఈ మధ్య పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి ఇది మరో లెవెల్ కు వెళ్లిపోయింది. ముఖ్యంగా రెడ్లకు సంబంధించిన ఒక సమావేశానికి వెళ్లిన సమయంలో ఆయన రెడ్డిల గొప్పతనాన్ని పొగిడే క్రమంలో చేసిన కామెంట్లు తెలంగాణలో పెద్ద దుమారాన్నే రేపాయి. కాంగ్రెస్ లో రెడ్డిలు ఉంటే చాలా ఇంక వేరే కులం వాళ్లు అక్కర్లేదా..? అంటూ సొంత పార్టీ నాయకులే విమర్శలు చేశారు. అదే మీటింగ్ లో ఆయన మరో కుల ప్రస్తావన తెచ్చారు. రెడ్డిలకు, వెలమలకు ఎప్పటి నుంచో జాతివైరం ఉందని వ్యాఖ్యానించారు. ఇది కూడా కులాల మధ్య రచ్చకు కారణమైంది. తెలంగాణల చరిత్రలో రాజకీయ నాయకులు పెద్దగా ఎప్పుడూ కులాలప్రస్తావన తీసుకురారు. ఆ తర్వాత కులాల పంచాయతీలోనే మల్లారెడ్డి.. జోక్యం చేసుకున్నారు. సొంతకులమే అయినప్పటికీ ఎందుకో ఆయన తీవ్రస్థాయిలో రేవంత్ పై వ్యక్తిగత దాడి చేశారు. ఆ తర్వాత రెడ్డిల సింహగర్జన పేరుతో జరిగిన సమావేశానికి మల్లారెడ్డి వెళ్లి అక్కడ టీఆరెస్ ప్రభుత్వాన్ని పొగడడం, ప్రభుత్వ పధకాల గురించి ప్రస్తావించడంతో అక్కడ ఉన్న కొంతమంది రెడ్లకు కోపమొచ్చింది. రెడ్ల మీటింగ్ కు వచ్చి వెలమలను పొగుడుతూ వారి పాలనను కొనియాడడంతో అక్కడి కుర్చీలు గాల్లోకి లేచాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మల్లారెడ్డి పోలీసుల సాయంతో అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది. ఇది ఏకంగా తనను రేవంత్ రెడ్డే హత్య చేయించడానికి ప్రయత్నించాడని.. వందమందిని పంపి దాడి చేయించాడని ఆరోపించే స్థాయికి వెళ్లింది.

ఇవి కూడా చదవండి

అటు కమ్మ పంచాయతీ.. 

ఇక్కడ రెడ్డిల పంచాయతీ నడుస్తోంటే ఖమ్మంలో కమ్మ పంచాయతీ నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో కమ్మల సంఖ్య కాస్త ఎక్కువే.. ఖమ్మంలో చాలావరకూ ఆంధ్రా కల్చర్ కనిపిస్తుంది.. అయితే అక్కడ ఇతర కులంతో పంచాయతీ లేకపోయినప్పటికీ ఒకే కులంలో రెండువర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు. అటు రేణుకాచౌదరి,ఇటు పువ్వాడ అజయ్ మధ్య..ఈ మధ్య చెలరేగిన వివాదం ఇలాంటిదే.. ఒక కమ్మకులానికి చెందిన సాయిచౌదరి అనే బీజేపీ కార్యకర్త పువ్వాడ అజయ్ వేదింపుల వల్లే చనిపోయాడనేది ఆయన మీద ఆరోపణ. అదే ఆరోపణలతో బీజేపీ పెద్ద ఎత్తున పువ్వాడ అజయ్ పై విరుచుకుపడింది.

అదేక్రమంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అతిధిగా హాజరైన పువ్వాడ అజయ్..రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ మంత్రిని తానొక్కిడినే అని.. తనకు కమ్మ కులం నుంచి ఎవరూ పెద్దగా మద్దతు ఇవ్వడం లేదని కష్టసమయంలో అండగా నిలవడం లేదని బాధను వ్యక్తం చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన రేణుకాచౌదరి పువ్వాడ అజయ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. నీవల్ల చనిపోయింది కూడా కమ్మ కుర్రాడేనని ఇలాంటి సమయంలో కమ్మల నుంచి సింపతీ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావని ఆమె మండిపడ్డారు. అయితే ఇక్కడ చనిపోయింది..అందుకు కారణమైంది..ఆ తర్వాత తిట్టింది ముగ్గురూ ఒకే సామాజికవర్గం..కానీ మూడు వేర్వేరు పార్టీలు..చనిపోయింది బీజేపీ కార్యకర్తల అయితే అందుకు కారణమైన కమ్మ నేత పువ్వాడ అజయ్ టీఆరెస్ పార్టీ కాగా.. ఆయన్ను విమర్శించిన రేణుకాచౌదరి కాంగ్రెస్ పార్టీ.. ఈ కమ్మ కుల పంచాయతీ ఇప్పుడు మరోసారి ఖమ్మంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

కుల రాజకీయం మొదలైంది.. రజాకార్ల అరాచక పాలన సాగుతున్న సమయంలోనూ ఇలాంటి కులగోల తెలంగాణలో మచ్చుకైనా కనిపించేది కాదు.. తెలంగాణ సాధన ఉద్యమంలోనూ ఎక్కడ కుల ప్రస్తావన రానేరాలేదు. ఆఖరికి ఉమ్మడి పాలనలనూ ఒకేరాష్ట్రం కింద ఉన్నప్పటికీ ఆంధ్రా లో కుల ఆధిపత్య పోరులో ఒకరినొకరు చంపుకుని అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా తెలంగాణలో కులాల రగడ ఎప్పుడూ లేదు.. వెనుకబడిన వర్గాలను తెలంగాణలో సబ్బండ వర్గాలంటారు. ఆంధ్రాలో ఒకే గ్రామంలో అగ్రకులాలన్నీ ఊళ్లో ఉంటే ఊరి చివర వాడలు, పల్లెల పేర్లతో ఎస్సీ,ఎస్టీలను ఉంచే కల్చర్ ఇప్పటికీ కొనసాగుతోంది. కారంచేడు, చుండూరు లలో దళితులపై జరిగిన దారుణాలు చరిత్రలో నిలిచిపోయాయి.. కానీ ఇక్కడ అలాంటి ఘటనలు పెద్దగా ఉండవు.. కానీ ఈ మధ్య కాలం ఓట్ల వేటలో ఇక్కడా కుల రాజకీయ మొదలైంది. ఒక విధంగా ఆ కులరొచ్చు ఇక్కడా ప్రారంభమైందనే చెప్పాలి.. అధికారం కోసం ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలను కులాల పేరుతో విభజించి ఓట్లను దండుకునే సంస్కృతి మొదలైంది. అంతెందుకు ఈ మధ్య జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కుల ప్రస్తావన ఎక్కువగా తెచ్చారు. టీఆరెస్ కు రాజీనామా చేసిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ కులాన్ని జనాల ముందుకు తెచ్చారు. అక్కడే ముదిరాజ్ లంతా కలిసి ఆయన్ని గెలిపించాలని నినాదం బయటకు వచ్చింది. అంతేగాదు బీసీ వర్గానికి చెందిన ఈటెలకు వెలమ దొర అయిన కేసీఆర్ కు మధ్య ఈ పోరాటం అంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎప్పుడూ లేనిది ఈ ఎన్నికల్లో ముదిరాజ్ కుల ప్రస్తావన ఎక్కువగా తెచ్చారు. అదే ఎన్నికల్లో అధికార టీఆరెస్ ప్రభుత్వం కూడా దళితబంధును ప్రకటించింది. ఏకంగా ఒక కుటంబానికి పదిలక్షల రూపాయలు ఇవ్వడం అనేది బహుశా 74ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎప్పుడూ జరగలేదు..పథకం మంచిదే కానీ దళిత ఓట్ల కోసమే ఇలాంటి పథకాలు తెచ్చిందనే విమర్శల ఉన్నాయి.

కులపంచాయతీ ఏకంగా పరువు హత్యల దాకా.. 

కుల పంచాయతీలు ఇప్పుడు హత్య ల దాకా వెళ్లాయి..రీసెంట్ గా తెలంగాణలో జరుగుతున్న పరువు హత్యలు ఆందోళన కలిగించేలా మారాయి.. ఈ మధ్య బేగంబజార్ లో జరిగిన నీరజ్ హత్యలో ఈ కుల విబేధాలు మరోసారి తెరమీదికి తెచ్చాయి. మార్వాడిలకు చెంది నీరజ్ ..యాదవ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఇందుకు కారణం.. అందుకే అత్యంత దారుణంగా చంపేశారు.. నల్గొండలో జరిగిన అమృత, ప్రణయ్ ల ప్రేమ నేపథ్యంలో ఎస్సీ కులానికి చెందిన వాడనే కారణంతో వైశ్య కులానికి చెందిన అమృత తండ్రి అతన్నిఅత్యంత దారుణంగా నడిరోడ్డుమీదే హత్య చేయించాడు.. ఇక సరూర్ నగర్ లో ఎస్సీ కులానికి చెందిన నాగరాజు ముస్లిం మతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడనే క్రమంలో అతన్ని నడిరోడ్డుమీద అమ్మాయి అన్న హత్య చేశాడు.. ఇది కేవలం సిటీకి మాత్రమే ఈ కుల కోణం పరిమితం కాలేదు..ఆదిలాబాద్ లో జిల్లాలో సైతం మారుమూల గ్రామమైన ఉట్నూరు లాంటి చోట కూడా లంబాడి కులానికి చెందిన యువతి ముస్లిం యువకుడిని ప్రేమించిందని ఏకంగా తన కూతుర్నే గొంతు కోసి చంపాడు తండ్రి పవార్..ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఈ మధ్యకాలంలో జరిగిన ఈ కుల హత్యలు అనేకం ఉన్నాయి.

కులవైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదం.. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ నిత్యం ఎక్కడో ఒక చోట రగులుతూనే ఉంటాయి. ఓట్ల వేటలో ఎన్నికల ముందు రాజకీయనాయకులే.. కులాల మధ్య చిచ్చు పెడుతుంటారు.. కులాల మధ్య జరిగే ఆ మంటల్లో రాజకీయ నాయకులు చలికాచుకుంటూ ఉంటారు. అంతెందుకు నిన్నగాక మొన్న అమలాపురంలో జరిగిందీ ఇదే.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టారనే కారణంతో అగ్రవర్ణాలకు చెందిన వారు ఏకంగా అమలాపురం మొత్తాన్ని అగ్నిగుండంగా మార్చేశారు. ఏకంగా మంత్రి,ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టారు. ఇలాంటి ఘటనలు అక్కడ నిత్యకృత్యమే..నిజానికి ఈకుల కుంపట్ల వల్ల నష్టపోయేది ,పోతున్నది ప్రజలే.. బాగుపడుతున్నది మాత్రం రాజకీయ నాయకులే.. ప్రజలంతా కులాలకు అతీతంగా కలిసి మెలిసి ఉంటే వాళ్ల కి అధికార పీఠం దక్కదు ..అందుకే కులాలవారీగా విడిపోయి నిత్యం తన్నుకుంటూ ఉంటేనే వారికి మంచిది.అందుకే ఆ కులాలమ మధ్య అంతరాలను పెంచేలా రెచ్చగొడుతూనే ఉంటారు. అందుకే ఈ కులగజ్జికి మందుండదు..ఒకసారి అంటాక నిత్యం గోక్కోవడమే తప్ప దురద తగ్గదు..ఎన్ని జాలిమ్ లోషన్లు రాసినా ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం ఉండదు.. ఈ కుల వైరస్ అనేది కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుంది.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది కానీ కుల వైరస్ కు ఇంతవరకూ ఎవరూ వ్యాక్సిన్ కనిపెట్టలేదు.

-అశోక్ వేములపల్లి, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, టీవీ9 తెలుగు

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..