Telangana: ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటో చెప్పిన కేటీఆర్
కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలని నేతలకు కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికలపై నేతలు, కార్యకర్తల నుంచి నేతలు అభిప్రాయాలు స్వీకరించారు. 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి, నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలుపెట్టకముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలని తెలిపారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదని.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి అనేక కారణాలున్నాయని.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం ఒక ప్రధాన కారణమన్నారు. ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందని.. అప్పట్లో ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదని కేటీఆర్ అన్నారు. కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని.. సూర్యాపేట లో మాత్రమే గెలిచామని చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి వీడాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు.. ఇపుడేం చేస్తున్నారో ప్రజలకు వివరించాలని అన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గత నవంబర్‌లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని.. నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి రెడ్డికే పంపాలని చెప్పారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి దాపురిoచిందని కేటీఆర్ విమర్శించారు. KRMBకి కృష్ణా ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగిoచి తెలంగాణ జుట్టును కేంద్రంలో చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని అన్నారు. అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోదీ బీఆర్‌ఎస్‌ను కాలుస్తారట అని కేటీఆర్ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ అదానీని దొంగ అంటే.. రేవంత్ రెడ్డి దొర అంటున్నారని తెలిపారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి ఉందని.. దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.