Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాజీ సీఎం ఫుల్ ఫోకస్.. గెలుపు వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం
Jubilee Hills Bypoll: తెలంగాణ రాజకీయాలను జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షేక్ చేస్తోంది. సమయం లేదు మిత్రమా అంటూ మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓవైపు మాటల యుద్ధం, మరోవైపు గెలుపు వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. మరి జూబ్లీ పల్స్ పట్టుకునేదెవరు? విక్టరీ కొట్టేదెవరు?. ఓ లుక్కేద్దాం పదండి.

జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలిచితీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాయి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ప్రచారానికి వాడుకుంటూ ఓ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాయి. అందులోభాగంగానే జూబ్లీ ఉపఎన్నికపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరికలతో పాటు ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరూ సమాయత్తం కావాలని సూచించారు..
ఎన్నికల ప్రచారంతో భాగంగా గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ… రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్న విషయాలను ప్రస్తావించాలని నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలి నేతలకు సూచించారు.
ఇదిలా ఉండగా అటు అధికార కాంగ్రెస్ కూడా గెలుపే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తోంది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతి అంటూ జూబ్లీ జనాలకు చెబుతోంది. అంతేకాదు కవిత కామెంట్స్‌ను ఓ అస్త్రంగా మార్చుకుని ప్రచారం నిర్వహిస్తోంది. రెండేళ్ల పాలనలో తాము చేసిన ప్రజాసంక్షేమమే హస్తంపార్టీని గెలిపిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ ముఖ్యనేతలు.
ఇటు బీజేపీ కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. జూబ్లీహిల్స్‌లో తమదే గెలుపంటోంది. ఓట్ల కోసం గోరక్షకులపై దాడి చేయించి.. తప్పుడు ప్రచారం చేయిస్తోందని అధికార కాంగ్రెస్‌పై కాషాయపార్టీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమదే గెలుపంటున్నారు. మొత్తంగా… జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలిచితీరాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి.? ఎవరి ప్రచారానికి ఓట్లు రాల్తాయన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




