Telangana: కాబోయే వాడని సర్వం అర్పిస్తే.. ఇలా చేస్తాడని తాను ఊహించలేదు
మూడునెలల క్రితమే యువతి నిశ్చితార్థం జరిగింది. కోటి ఆశలతో దాపంత్య జీవితంలోకి అడుగుపెట్టబోయింది. అయితే కాబోయే వరుడి క్రూరత్వానికి బలి అయింది. శారీరక వేధింపులు, మానసిక చిత్రహింసలు భరించలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలో కలకలం రేపుతోంది ...

పెళ్లికి ముందే యువతి చిత్రవధ అనుభవించింది. ఒళ్లంతా గాయాలతో వణికిపోయింది. బిడ్డ నరకయాతన చూసి కన్నవాళ్లు బోరుమన్నారు. ఇలా చేసిందెవరో కాదూ.. కాబోయేవాడే. పెళ్లికి ముందే ఇలా చేశాడంటే.. పెళ్లయ్యాక దుర్మార్గం ఇంకేస్థాయిలో ఉంటుందోనని ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్యతండాకు చెందిన తుళ్లిక శ్రీతో.. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురవాసి బానోతు బిచ్చకు పెళ్లి చేయాలని నిర్ణయించారు పెద్దలు. పెళ్లికి సంబంధించిన మాటా ముచ్చట మూడునెలల కిందటే మాట్లాడుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేస్తున్నానని.. లక్షకు పైగా జీతం వస్తుందని బిచ్చా చెప్పాడట. దీంతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని భావించి.. కట్నం కింద 60 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు తుళ్లిక శ్రీ తల్లిదండ్రులు.
ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు.. కాల్స్, మెసేజ్‌లతో తక్కువ టైమ్‌లోనే దగ్గరైపోయారు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి దైవ దర్శనాలకు తీసుకెళ్తానంటే బిచ్చాతో తుళ్లిక శ్రీని పంపించేవాళ్లు పేరెంట్స్. అలా ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారట. ఈనెల 8న బావ కొడుకు బర్త్‌డే ఉందంటూ బయటకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. తుళ్లిక శ్రీ నీరసంగా కనిపించడంతో ఏమైందని అడిగారు తల్లిదండ్రులు. దీంతో బిచ్చా పెట్టిన టార్చర్‌ని పూసగుచ్చినట్టు వివరించింది. వేరే అబ్బాయి మెసేజ్ పెడితే.. సంబంధం అంటగట్టి దారుణంగా కొట్టాడని కన్నీటిపర్యంతమైంది. ఆ క్రమంలోనే ఇక పెళ్లి చేసుకునేది కూడా లేదని.. చస్తే చావంటూ మెసేజ్ పెట్టాడు బిచ్చా. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తుళ్లిక శ్రీ.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు ట్రీట్‌మెంట్ అందించినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించి తుళ్లిక శ్రీ చనిపోయింది.
బిచ్చాను ఉరితీయాలని డిమాండ్
బిచ్చా ఇంతకుముందు కూడా ముగ్గురు యువతులను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించారు తుళ్లిక శ్రీ బంధువులు. అలాంటివాడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తుళ్లిక శ్రీలాంటి మరో యువతి అతని బారినపడకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టేకులపల్లి పోలీసులు.. పరారీలో ఉన్న బిచ్చా కోసం గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
