Telangana: సెంచరీ దాటిన బామ్మ.. నాలుగు తరాలతో కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు
పెద్దలకు నమస్కరించినప్పుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించమని దీవిస్తారు. అంతేకాదు పూజాదికార్యక్రమాలలో అయితే శతమానం భవతి శతాయుః పురుష షతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి అంటూ పండితులు వేద మంత్రాల సాక్షిగా దీవిస్తారు. అంటే నూరేళ్ళు జీవించమని అర్ధం.. అయితే మారిన జీవన విధానం, అలవాట్లతో ఇప్పుడు నూరేళ్ళు జీవించే వారు అరుదుగా మారుతున్నారు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లాలోని సెంచరీ దాటిన బామ్మకు నాలుగు తరాలకు చెందిన వ్యక్తులు ఘనంగా జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు.

నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలా నూరేళ్ల వయసు వచ్చిన సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్న ఓ బామ్మ నాలుగు తరాల మనవళ్లు, మనవరాళ్లు సమక్షంలో ఘనంగా వందేళ్ల పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన యలమద్ది సీతమ్మ 100వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
తన వయసు నూరేళ్లు అంటూ నవ్వుతూ చెప్తున్న బామ్మ నూరేళ్ల వయసులోను ఇతరులపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తుంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు ఆడపిల్లలు. నాలుగు తరాల కుటుంబ సభ్యులు మనవళ్లు, మనువరాళ్లు, ముని మనవళ్లు, మునివరాళ్లు మొత్తం 25 మంది కుటుంబ సభ్యులు, బంధువుల నడుమ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయించి పండుగ వాతావరణంలా జరుపుకొన్నారు. సమయానికి తింటూ, కష్టపడి పని చేస్తే జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని సీతమ్మ తన అనుభావాలను మనువళ్లు, మనవరాళ్లతో పంచుకున్నారు. కష్ట,నష్టాల్లోను తమను కంటికిరెప్పలా కాపాడుతూ తమను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు సీతమ్మకు కుమారులు, కూతుర్లు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



