AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఉద్యమాల ఖిల్లాలో కళ తప్పుతున్న గులాబీ పార్టీ.. ఎన్నికల వేళ పెరుగుతున్న వలసలు..!

ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ జిల్లాలో గులాబీ జెండా పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. అధినేతకు అత్యంత ఇష్టమైన జిల్లాగా చెప్పుకునే కరీంనగర్ నేడు వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. స్వరాష్ట్ర కల సాకారం కోసం నినందించిన ఉద్యమ ఖిల్లా నేడు బలహీనం వైపు సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ నాయకత్వం గుండెల్లో దడ పుట్టించి చరిత్ర సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఎదురీదాల్సిన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది..!

BRS: ఉద్యమాల ఖిల్లాలో కళ తప్పుతున్న గులాబీ పార్టీ.. ఎన్నికల వేళ పెరుగుతున్న వలసలు..!
Congress vs BRS
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: May 04, 2024 | 2:19 PM

Share

ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ జిల్లాలో గులాబీ జెండా పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. అధినేతకు అత్యంత ఇష్టమైన జిల్లాగా చెప్పుకునే కరీంనగర్ నేడు వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. స్వరాష్ట్ర కల సాకారం కోసం నినందించిన ఉద్యమ ఖిల్లా నేడు బలహీనం వైపు సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ నాయకత్వం గుండెల్లో దడ పుట్టించి చరిత్ర సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఎదురీదాల్సిన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది..!

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను క్రిమినల్ కేసులు వెంటాడుతున్నాయి. కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి బాధ్యతలు చేపట్టిన తరువాత భూ అక్రమణలకు పాల్పడిన వారి వేట కొనసాగింది. రికార్డులను తారు మారు చేసి యజమానులను ఇబ్బందులకు గురి చేసిన వారి భరతం పట్టడం మొదల పెట్టారు కరీంనగర్ పోలీసులు. ఇఫ్పటి వరకు కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో నమోదయిన కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

దీంతో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఒకరకమైన వ్యతిరేకత మొదలైంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాకర్స్ ను కలిసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వారి నుండి ఎదురవుతున్న ప్రశ్నల పరంపర కూడా ఇక్కడ పార్టీ పరిస్థితికి నిలువుటద్దం పడుతోంది. కార్పోరేటర్లు, వారి భర్తలు చేసిన అరాచకాల గురించి నగర వాసులు ఎకరవు పెట్టిన తీరు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. ఓ చోట రోడ్డు గురించి మరో చోట ఇంటి నిర్మాణ అనుమతుల గురించి, భూ కబ్జాల గురించి ఇలా ప్రతి చోట కూడా ఏదో ఒక రకమైన అంశాలపై స్థానికులు నాయకులకు వివరించారు.

పోలీసు కేసులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎదురవుతున్న ఇలాంటి ఎదురు దాడులతో స్థానిక నాయకత్వం ఇబ్బందులు పడుతోందట. ముఖ్య నాయకులు ఒకరిద్దరు అండదండగా ఉండడంతో నగరంలోని పలుచోట్ల చేసిన తప్పిదాలన్ని కూడా ఎంపీ ఎన్నికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వినోద్ కుమార్ ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కంటే ప్రజల నుండి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇంతకాలం గులాబీ జెండా నీడన ఉన్న నాయకులు ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. ఇప్పటికే పలువురు కార్పోరేటర్లు, నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీవైపు అడుగులేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కార్పోరేటర్లు కొంతమంది పార్టీ మారేందుకు సమాయత్తం అయినప్పటికీ వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ తాజాగా మాత్రం కార్పోరేటర్లు, ఇతర నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నా కూడా పట్టించుకునే వారే లేకుండా పోయారు. తాము పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నామన్న విషయాన్ని స్థానిక నాయకత్వానికి చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 8 మంది కార్పోరేటర్లు, వారి భర్తలు, మాజీ కార్పోరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నట్టుగానే ఉంది. కరీంనగర్ లో గులాబీ పార్టీ ప్రాభవం గణనీయంగా తగ్గినట్టే కనిపిస్తోంది. మరో 10 రోజుల్లో ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగనుండగా వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడం పార్టీకి తీరని లోటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నేరాల్లో ఇరుక్కున్న వారితో పాటు వివాదాలకు దూరంగా ఉన్న నాయకులు కూడా ఉన్నారు. దీంతో ప్రజలతో మమేకమైన నాయకులు పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టమే అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.