Hyderabad: ఇళ్లు రెంటుకిచ్చేవారికి బిగ్ అలర్ట్.. ఇలాంటి వారితో బీకేర్‌ఫుల్.. లేదంటే మొదటికే మోసం!
హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పేరుతో జరుగుతున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అద్దె ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని నకిలీ పత్రాలతో తనఖా పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న ఈ ముఠా ముందుగా ఇళ్లను అద్దెకు తీసుకునేది. అనంతరం వాటిని తమ సొంత ఇళ్లుగా చూపిస్తూ అమాయకులను నమ్మించేది. ఇళ్ల యజమానులుగా నటిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి, వాటిని తనఖా పెట్టి డబ్బులు దోచుకునేలా ప్రణాళిక రచించింది. ఇందలో భాగంగానే బండ్లగూడాకు చెందిన ఓ మహిళను మోసం ఆమెను రూ.3 లక్షలు కాజేశారు కేటుగాళ్లు, తరువాత అసలు ఇంటి యజమాని వచ్చి నిజం చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ముఠా గుట్టు బయపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఇదే విధానాన్ని అనుసరిస్తూ పలువురిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. అద్దె ఇళ్లు తీసుకుని, వాటిపై నకిలీ పత్రాలు తయారు చేసి, తనఖా ఒప్పందాల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 24 ఏళ్ల షేక్ ఓమర్ అమోడి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతను తనతో పాటు మరో నలుగురు సహచరులు మహ్మద్ బిన్ ఉస్మాన్, మహ్మద్ బసిత్, అలీ జబ్రీ, షకీర్ హుస్సేన్ పాల్గొన్నట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం వారు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో నగరంలో రియల్ ఎస్టేట్ మోసాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా మరికొంతమంది బాధితులు ఉండే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. డబ్బు లావాదేవీల ట్రైల్‌ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ప్రాపర్టీ లావాదేవీలలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యాజమాన్య పత్రాలను సమగ్రంగా ధృవీకరించిన తరువాతే డబ్బులు చెల్లించాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
