AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అవినీతి తిమింగలాలు @రూ.100 కోట్లు.. ACB దాడుల్లో షాకింగ్ విషయాలు

Telangana ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ACB) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఏడాది కాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపాదనలు, లంచాల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ.. వరుస దాడులతో సంచలన విషయాలను వెలికితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పలువురు అధికారులపై నమోదైన అక్రమాస్తుల కేసులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు లక్షల్లో ఉండే ఒక్కో అవినీతి అధికారి అక్రమాస్తుల లెక్కలు.. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Telangana: అవినీతి తిమింగలాలు @రూ.100 కోట్లు.. ACB దాడుల్లో షాకింగ్ విషయాలు
Telangana Acb Raids
Vijay Saatha
| Edited By: |

Updated on: May 28, 2026 | 6:54 PM

Share

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. ఒకప్పుడు అవినీతి కేసుల్లో గుర్తించిన సొమ్ము లక్షల్లో ఉండేది. అక్కడక్కడ ఒకట్రెండు కోట్ల వరకు వినిపించేది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాస్తుల కేసులు, లంచాల వ్యవహారాలు, అక్రమ సంపాదనలపై వరుస దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ.. అవినీతి అధికారుల అక్రమ సామ్రాజ్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఏసీబీ దాడుల్లో దొరికిపోతున్న ఒక్కో అవినీతి అధికారి ఆస్తుల చిట్టా ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారాయి.

రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్, పవర్ వంటి కీలక శాఖల అధికారులపై ఏసీబీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వరుస దాడులతో అవినీతి అధికారుల అక్రమ సంపాదన సామ్రాజ్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.  ముఖ్యంగా భూముల వ్యవహారంలో కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు అక్రమ సొమ్ముల చిట్టా విప్పుతోంది ఏసీబీ. ఇప్పటివరకు ఈ తరహాలో రూ.100 కోట్ల మార్క్‌కు పైగా అక్రమాస్తులను కూడబెట్టుకున్న అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తున్న అధికారుల లిస్టును టీవీ9 సంపాదించింది. అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏసీబీ అరెస్టు చేసిన సమయంలో వీరి అక్రమాస్తుల విలువ రూ.10 కోట్లకు లోబడే ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో వాటి విలువను చూస్తే మాత్రం ఏసిబి అధికారులకు సైతం కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. పట్టుబడుతున్న సమయంలో దొరుకుతున్న ఆస్తులకు పదింతలు ఎక్కువగా మార్కెట్ ధర ఉంటోంది. దీని ప్రకారం రూ.100 కోట్లకు పైబడి అక్రమస్తులను కూడబెట్టుకున్న అధికారుల భరతం పడుతుంది ఏసీబీ.

హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ వ్యవహారం ప్రస్తుతం  తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జలమండలి అక్రమాలకు కేంద్రబిందువుగా మారిన కుమార్‌పై ఏసీబీ అధికారులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసిన అధికారులు.. ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ విధించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.వాటర్ కనెక్షన్లు, ట్యాంకర్లు, టెండర్ల వ్యవహారాల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమర్షియల్, డొమెస్టిక్ వాటర్ కనెక్షన్ల పేరుతో భారీగా వసూళ్లు చేసినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లకు అధికారిక వ్యవస్థకు బయటగా ఇల్లీగల్ ట్యాంకర్లు పంపిస్తూ భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.  ట్యాంకర్ల అనుమతులు, పంపిణీ వ్యవహారంలో లంచాల దందా నడిపించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. పైప్‌లైన్ టెండర్లలోనూ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయి.

ఇక కుమార్ అక్రమ సంపాదన లెక్కలు చూస్తే అధికారులే షాక్ అవుతున్నట్టు సమాచారం. మల్లాపూర్ నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో భూములు, కొబ్బరి తోట, విలాసవంతమైన ఫామ్ హౌస్, సంగారెడ్డి జిల్లాలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో ఇండిపెండెంట్ హౌస్, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, ఒక బైక్ ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు.. వాటర్ ట్యాంకర్ల అక్రమ దందాతో రోజుకు రూ.50 వేల వరకు సంపాదించినట్టు ఏసీబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అక్రమ వాటర్ కనెక్షన్ల ద్వారానే ఎక్కువ లాభాలు పొందినట్టు విచారణలో బయటపడుతున్నట్టు సమాచారం.

తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మర్రి వంశీ మోహన్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇటీవల ఆయన నివాసంతో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఈ కేసులో వంశీ మోహన్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ విధించింది.ఏసీబీ సోదాల్లో మొత్తం 19 ఖాళీ స్థలాల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వనస్థలిపురం, మణికొండ, మజీద్‌బండ ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం వద్ద 2 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా బయటపడింది. సోదాల సమయంలో రూ.2.10 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షల నిల్వలు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కార్లు కూడా ఆయన ఆస్తుల్లో భాగంగా గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.6.22 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 8 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలులో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే బినామీ ఆస్తులు, ఇతర పెట్టుబడుల లెక్కలు బయటకొస్తే ఈ మొత్తం వంద కోట్లకు పైబడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

గత ఏడాది ఏసీబీ వలలో చిక్కిన అవినీతి తిమింగలాలు..

  • ఇక గత ఏడాది తెలంగాణలో ఏసీబీ దాడుల తీరు చూస్తే.. మాజీ హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు బయటపడగా.. ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్ కేసులో కూడా భారీ అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.
  • TGSPDCL అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఎరుగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి కేసుల్లోనూ కోట్ల విలువైన ఆస్తులు వెలుగు చూశాయి.
  • మాజీ హెచ్‌ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ నిర్వహించిన దాడులు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఏకంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
  • ఇక ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్ కేసులోనూ భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
  • సంగారెడ్డి సమీపంలో ఉన్న 31 ఎకరాల భూమి విలువే సుమారు రూ.60 కోట్లుగా అంచనా వేశారు. తన డ్రైవర్ పేరుతో బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
  • TGSPDCL అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఎరుగు ఇంటిపై జరిగిన దాడుల్లోనూ భారీ ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. రూ.100 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులను గుర్తించారు.  అంతేకాకుండా రూ.2.18 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కేసులోనూ భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. రూ.60 కోట్లకు పైగా విలువైన ఆస్తులతో పాటు విల్లా, ఫ్లాట్లు, 19 ప్లాట్లు, 16 ఎకరాల భూములు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది.
  • ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్, జహీరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
  • రంగారెడ్డి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు ఇంటిపై నిర్వహించిన సోదాల్లో మైహోమ్ భూజాలో ఫ్లాట్, రైస్ మిల్, పలుచోట్ల వ్యవసాయ భూములు గుర్తించారు. భారీ స్థాయిలో నగదు, బంగారం, వాహనాలు కూడా బయటపడ్డాయి.
  • హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి కేసులో రూ.7.69 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఎనిమిది ప్లాట్లు, 14 ఎకరాల భూమి, విల్లా, షాపులు ఉన్నట్టు గుర్తించారు.

Follow Us