తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన IMD
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో ప్రవేశించనున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. ఈ సమాచారాన్ని తాము ధృవీకరించలేదని స్పష్టం చేసింది. భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా కేరళలో రుతుపవనాల అధికారిక ప్రవేశాన్ని ప్రకటించలేదని పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు రాకపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాబోయే ఒకటి రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని కొన్ని మీడియా వర్గాల్లో వచ్చిన సమాచారాన్ని వాతావరణ కేంద్రం తోసిపుచ్చింది. నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి ఈ సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ధృవీకరించలేదని స్పష్టంచేసింది. ఈ వార్తలు కేవలం పుకార్లని, పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టంచేసింది.
భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా కేరళలో రుతుపవనాల అధికారిక రాక (Onset) తేదీని ప్రకటించలేదని గుర్తుచేసింది. సాధారణంగా, కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత అవి తెలంగాణకు చేరుకోవడానికి సుమారు 5 నుండి 7 రోజుల సమయం పడుతుందని తెలిపింది.
తెలంగాణలోకి రుతుపవనాల తక్షణ రాకపై ఐఎమ్‌డీ (IMD) హైదరాబాద్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని స్పష్టంచేసింది. ఖచ్చితమైన, తాజా వాతావరణ సమాచారం కోసం మీడియా సంస్థలు, ప్రజలు ఐఎండీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఐఎండీ ధృవీకరించబడిన బులెటిన్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం రాత్రి ఓ అధికారిక ప్రకటన విడుదలచేసింది.
