Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో ఐక్యతా రాగం.. సడెన్‌గా ఏకమైన ఎంపీ, ఎమ్మెల్యేలు.. అందుకోసమేనా..?

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఐక్యతను చాటేలా కీలక మీటింగ్ నిర్వహించారు. బీజేఎల్పీ విస్తృత సమావేశానికి ఎంపీలు సైతం హాజరై రాష్ట్ర సమస్యలపై బీజేపీ పోరాటం సాగుతుందనే సంకేతాలు ఇచ్చారు.

బీజేపీలో ఐక్యతా రాగం.. సడెన్‌గా ఏకమైన ఎంపీ, ఎమ్మెల్యేలు.. అందుకోసమేనా..?
Bjlp Meeting
Vidyasagar Gunti
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 12, 2024 | 4:55 PM

Share

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఐక్యతను చాటేలా కీలక మీటింగ్ నిర్వహించారు. బీజేఎల్పీ విస్తృత సమావేశానికి ఎంపీలు సైతం హాజరై రాష్ట్ర సమస్యలపై బీజేపీ పోరాటం సాగుతుందనే సంకేతాలు ఇచ్చారు.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలైన రుణమాఫీ అమలు, రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేపట్టాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ప్రస్తుత పరిణామాలపై అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ చాంబర్‌లో పార్టీ శాసనసభాపక్ష విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీ హాజరు కావడం విశేషం. హాజరైన వారిలో ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, హరీశ్ బాబు, పాయల్ శంకర్, ధన్ పాల్, రామారావు పాటిల్, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి ఉన్నారు.

రాష్ట్ర సర్కారు సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం పేరిట నిర్వహించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై చర్చించిన బీజేపీ నేతలు విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్నారని, 2003 లోనే అక్రమ నిర్మాణాలపై గుజరాత్ లో సీఎం గా మోడీ పక్షపాతం లేకుండా అందరివీ కూల్చివేశారని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. హైడ్రా మాత్రం ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందని.. తమకు సెక్యులర్ హైడ్రా కావాలని అరవింద్ డిమాండ్ చేశారు. రైతు రుణమాపీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. అందరికి రుణమాఫీ చేయాలని సెప్టెంబర్ 20న ధర్నా చౌక్ లో దీక్ష చేయనున్నట్లు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వరద బాధితులు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని,.. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని సర్కారును హెచ్చరించారు.

కమలం పార్టీ ఎంపీలు, ఎమ్మేల్యేలు అత్యవసర సమావేశం నిర్వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని.. లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న ప్రచారం వేళ ప్రజాప్రతినిధుల సమావేశం సఖ్యతను చాటుతోంది. తొలుత ఎల్పీ మీటింగ్ పెట్టాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంపీలను సైతం ఆహ్వానించి ఎల్పీనేత మహేశ్వర రెడ్డి పార్టీ అంతా కలిసి కట్టుగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇదే తరహాలో నేతలంతా కలిసి ప్రభుత్వ వైఫల్యాలను గ్రౌండ్ లెవల్ లోనూ నిలదీస్తే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని కేడర్ భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..