Wi-Fi: మీరు వైఫై వాడుతున్నారా.. ఈ తప్పులు చేస్తే మీ ఫోన్ హ్యాక్.. ?
ఈ రోజుల్లో ఉచిత వై-ఫై అంటే చాలు జనాలు అక్కడ వాలిపోతారు. కానీ పబ్లిక్ వై-ఫై మీ ఫోన్‌కి, మీ వ్యక్తిగత సమాచారానికి చాలా ప్రమాదకరం. రైల్వే స్టేషన్లు, మాల్స్, కాఫీ షాపుల్లో ఉండే ఇలాంటి నెట్‌వర్క్‌లను హ్యాకర్లు డేటా దొంగిలించడానికి వాడుకుంటారు.

నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మన రోజువారీ అవసరంగా మారింది. ఎక్కడికి వెళ్లినా ఉచిత వై-ఫై కోసం వెతకడం సర్వసాధారణం. అయితే ఈ ఉచిత సౌకర్యమే ఇప్పుడు మీ ఫోన్‌కు, మీ వ్యక్తిగత సమాచారానికి అతిపెద్ద ముప్పుగా మారవచ్చు. పబ్లిక్ వై-ఫై వాడకంపై భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ పౌరులను తీవ్రంగా హెచ్చరించింది. పబ్లిక్ వై-ఫై వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండుగ రోజుల్లో రైల్వే స్టేషన్లు, మాల్స్, కాఫీ షాపుల్లో ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇదే అదనుగా సైబర్ హ్యాకర్లు మన డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. మనం చిన్న పొరపాటు చేసినా, మన బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంది.
డేటా దొంగతనం జరిగే ప్రమాదం
ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా విద్యార్థులను ఉద్దేశించి ఇదే రకమైన హెచ్చరిక చేసింది. బస్ స్టాప్‌లు, రైల్వే స్టేషన్‌లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు, లైబ్రరీలలో లభించే పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా తమ వ్యక్తిగత లేదా కార్యాలయ ఖాతాలకు లాగిన్ కావద్దని సూచించింది. అలా చేయడం వల్ల డేటా దొంగతనం లేదా ఆర్థిక మోసం జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
ఎందుకు సురక్షితం కాదు?
భద్రతా లోపం: పబ్లిక్ వై-ఫైలో మన ఇంటి వై-ఫైలో ఉన్నంత భద్రత ఉండదు.
హ్యాకర్ల బెడద: హ్యాకర్లు మనల్ని మోసం చేయడానికి ఫేక్ వై-ఫై నెట్‌వర్క్‌లను తయారు చేస్తారు.
డేటా చోరీ: మీరు అలాంటి నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిన వెంటనే హ్యాకర్లు మీ ఫోన్ పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇమెయిల్స్ వంటి వాటిని సులభంగా దొంగిలించగలరు.
వైరస్‌లు: ఈ వై-ఫై ద్వారా మీ ఫోన్‌లోకి వైరస్‌లను పంపడం కూడా హ్యాకర్లకు చాలా తేలిక.
మీరు అలాంటి నకిలీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన వెంటనే హ్యాకర్లు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ యొక్క పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ సమాచారం, ఇమెయిల్స్, ఇతర వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు ఈ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మీ పరికరానికి సులభంగా వైరస్‌లను కూడా పంపగలరు.
అత్యవసరమైతే ఏం చేయాలి?
అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇంటర్నెట్ అవసరమైతే, పబ్లిక్ వై-ఫైని ఉపయోగిస్తున్నప్పుడు VPN సేవను ఉపయోగించడం ఉత్తమం. VPNని వాడటం వలన మీ పరికరానికి అదనపు భద్రత లభిస్తుంది. కాబట్టి ఉచిత వై-ఫై సౌకర్యాన్ని పొందే తొందరలో మీ వైపు నుండి చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండాలి.




