Meta AI: మెటా ఏఐ మిషన్.. సూపర్ క్లస్టర్లతో మేధో విప్లవానికి రంగం సిద్ధం!
అవతల ఓపెన్ ఏఐ, ఇక్కడ మెటా, కృత్రిమ మేధ రంగంలో విశ్వ స్థాయిలో పోటీ మొదలైంది. ఫేస్‌బుక్ తల్లిదండ్రి సంస్థ అయిన మెటా, ఏఐ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేసే స్థాయిలో భారీ ప్రణాళికలు అమలులోకి తెస్తోంది. మార్క్ జుకెర్బర్గ్ నేతృత్వంలో మెటా ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులతో ‘సూపర్ క్లస్టర్’ల నిర్మాణం ప్రారంభించబోతోంది.

మెటా ప్రణాళికలో తొలి మెరుగైన క్లస్టర్ పేరు ‘Prometheus’ దీని సామర్థ్యం ఏకంగా 1341 మెగావాట్లు. ఈ శక్తి ఎంతగా ఉంటుంది? అర్థం చేసుకోవాలంటే, ఒకేసారి దాదాపు 1.8 కోట్ల సీలింగ్ ఫ్యాన్లు తిరిగేంత శక్తిని దీనిలో వినియోగించవచ్చు. మరింత స్పష్టంగా చెప్పాలంటే, సుమారు 1.34 కోట్ల టీవీలు, లేదా 90 లక్షల ఫ్రిడ్జిలు, లేదా 6 కోట్ల ట్యూబ్‌లైట్లు ఒకేసారి పనిచేయగలిగే స్థాయిలో శక్తి అవసరం పడుతుంది. ప్రోమెథియస్’ తర్వాత మెటా యొక్క అగ్రస్థాయి లక్ష్యం ‘Hyperion Cluster’ దీని సామర్థ్యం ఏకంగా 5 గిగావాట్లు, అంటే ప్రస్తుత ప్లాన్ కంటే దాదాపు అయిదు రెట్లు అధిక శక్తితో పనిచేసే ఏఐ మిషన్. ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఏఐ శిక్షణ మాధ్యమంగా నిలిచే అవకాశం ఉంది.
సూపర్ క్లస్టర్లు ఎందుకు అవసరం?
ఏఐ మోడళ్లను నిర్మించాలంటే వేలాది గంటల గణన, డేటా శిక్షణ అవసరం అవుతుంది. దీన్ని సాధారణ కంప్యూటర్లతో చేయడం అసాధ్యం. అందుకే సూపర్ క్లస్టర్లు, అంటే భారీ శక్తితో పని చేసే డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి. ఇవే భవిష్యత్తు ఎల్‌ఎల్‌ఎంలకు (Large Language Models) ప్రాణవాయువు వంటివి. ఉదాహరణకు, DeepSeek వంటి ఏఐ మోడళ్ల శిక్షణకు సాధారణంగా 12-14 మెగావాట్ల శక్తి అవసరం అవుతుంది. కానీ మెటా అభివృద్ధి చేస్తున్న క్లస్టర్ మాత్రం దానికి పన్నెండు రెట్లు అధిక సామర్థ్యంతో రూపొందించబడుతోంది.
అధునాతన నియామకాలు – భారీ పెట్టుబడులు
ఈ మిషన్ కోసం మెటా ఇప్పటికే $14 బిలియన్ల (దాదాపు ₹1.2 లక్షల కోట్లు) పెట్టుబడి కేటాయించి, Scale AI అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగ నియామకాల్లో కూడా మెటా అత్యంత అద్బుతంగా వ్యవహరిస్తోంది. OpenAI, Anthropic, Apple వంటి దిగ్గజ కంపెనీల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే GitHub మాజీ CEO నాట్ ఫ్రెడ్మన్, Scale AI CEO అలెగ్జాండర్ వాంగ్ వంటి ప్రముఖులను Meta Super Intelligence Labs అనే ప్రత్యేక విభాగంలో నియమించింది. అత్యుత్తమ టాలెంట్‌కు రూ.850 కోట్ల దాకా ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం.
భవిష్యత్తు లక్ష్యం: ఏఐ ప్రపంచానికి మెటా ఆధిపత్యం
జీపీటీ, క్లాడ్, డీప్‌సీక్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా నిలిచే స్థాయిలో, మెటా తన ఏఐ మిషన్‌ను ప్రపంచానికి అంకితమిచ్చేందుకు సిద్ధమవుతోంది. శక్తివంతమైన సూపర్ క్లస్టర్లు, ప్రపంచస్థాయి టాలెంట్, లక్షల కోట్ల పెట్టుబడులతో మెటా రూపొందిస్తున్న ప్రణాళికలు, భవిష్యత్తులో ఏఐ రేసులో కీలక మలుపుగా నిలవనున్నాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




