Earth: వేగంగా తిరుగుతున్న భూమి.. తగ్గుతున్న పగలు.. ఏం జరుగుతుందంటే..?
సుమారు 1 నుండి 2 బిలియన్ సంవత్సరాల క్రితం, ఒక రోజు కేవలం 19 గంటలు మాత్రమే ఉండేది. దీనికి కారణం.. చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటం, దాని గురుత్వాకర్షణ ప్రభావమే. ఆ తర్వాత చంద్రుడు దూరంగా వెళ్లడంతో టైమ్ పెరిగింది. ఇప్పుడు మళ్లీ తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. భూమి తిరగడం ఆగిపోతే పగలు, రాత్రి అనేవి ఉండవు. భూమి తిరిగే వేగం కారణంగా పగటి సమయం మారుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో భూమి సాధారణం కంటే వేగంగా తిరుగుతుందని, దీనివల్ల పగలు సమయం కొంచెం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అగస్టు 5న చంద్రుని స్థానం భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీన్ని వల్ల 1.25 మిల్లీ సెకన్ల సమయం తగ్గుతుందని అంటున్నారు. సాధారణంగా భూమిపై ఒక రోజు దాదాపు 86,400 సెకన్లు లేదా 24 గంటలు ఉంటుంది. భూమి యొక్క భ్రమణం ఇంకా స్థిరంగా లేదు. ఇది చంద్రుడు, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రం, మనుషులు చేసే కొన్ని పనుల వల్ల ఇది ప్రభావితమవుతుంది.
మిలియన్ ఏళ్ల క్రితం ఒక రోజులో ఎన్ని గంటలు..?
భూమి భ్రమణం క్రమంగా మందగించింది. సుమారు 1 నుండి 2 బిలియన్ సంవత్సరాల క్రితం, ఒక రోజు కేవలం 19 గంటలు మాత్రమే ఉండేది. ముఖ్యంగా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటం, దాని గురుత్వాకర్షణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వల్ల సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన టైరన్నోసారస్ రెక్స్ యుగంలో, సగటు రోజువారీ భ్రమణం దాదాపు 23 1/2 గంటలు ఉండేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తరువాత కాలక్రమేణా, చంద్రుడు భూమి నుండి దూరంగా వెళ్ళే కొద్దీ సమయం ఎక్కువవుతూ వచ్చింది.
2024లో జులై 5న అతితక్కువ రోజు నమోదైంది. నిర్ణీత సమయం కంటే 1.66 మిల్లీ సెకన్లు తగ్గింది. ఇది పూర్తిగా అసాధారణమైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో, ఈ భ్రమణాలు సాధారణం కంటే వేగంగా ఉన్నాయి. గత దశాబ్దంలో సగటు రోజు పరిమాణం కొద్దిగా తక్కువగా మారింది. గత 5 ఏళ్లలో భ్రమణం 24 గంటల కంటే తక్కువ సమయంలోనే చాలాసార్లు పూర్తయింది. మంచు కరగడం, భూగర్భజల ప్రవాహం వంటి వాతావరణ మార్పులు కూడా భూమి యొక్క భ్రమణంలో మార్పులకు కారణమయ్యాయి. భూకంపాలు, కాలానుగుణ మార్పులు కూడా రోజుల పొడవును ప్రభావితం చేస్తాయి. కాగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు శాస్త్రవేత్తలు నెగిటివ్ లీప్ సెకన్‌ను తెరపైకి తెచ్చారు. 1972 నుంచి ఇప్పటివరకు కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌కు 27 లీప్ సెకన్స్ జోడించినట్లు తెలుస్తోంది.




