5G Services: 5జీ నెట్‌వర్క్ వాడేవారికి భారీ షాక్.. కొత్త సంవత్సరంలో పెరగనున్న భారం
2026లో మీ మొబైల్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరగనున్నాయి. 5జీ వాడేవారిపై మరింత భారం పడనుంది. వచ్చే ఏడాదిలో రీచార్జ్ ధరలను భారీగా పెంచనున్న కంపెనీలు.. 5జీ నెట్‌వర్క్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరించే చర్యలు చేపడుతున్నాయి. దీంతో 5జీ వాడేవారికి షాక్ తగలనుంది.

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. న్యూ ఇయర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఆర్ధికంగా మనల్ని ప్రభావితం చేసే అనేక మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్ని కొత్త నిర్ణయాలను సంస్థలు అమల్లోకి తెస్తూ ఉంటాయి. అందులో భాగంగా 2026లో టెలికాం రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని నిర్ణయాలు మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ కాగా.. మరికొన్ని బ్యాడ్ అని చెప్పవచ్చు. రీఛార్జ్ ధరల పెంపు నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ వరకు 2026లో రానున్న నూతన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రీఛార్జ్ ధరలు పెంపు
2024లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. రెండేళ్ల కాలపరిమితితో వాటిని పెంచాయి. ఇప్పుడు ఆ సమయం ముగియడంతో 2026లో మరోసారి పెంచేందుకు సిద్దమవుతున్నాయి. వచ్చే ఏడాది 20 శాతం వరకు రీఛార్జ్ ధరలను పెంచనున్నాయని తెలుస్తోంది. రానున్న సంవత్సరంలో 4జీ, 5జీ రీఛార్జ్ ప్లాన్లలో 16 నుంచి 20 శాతం వరకు రీఛార్జ్ ధరల పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. 5జీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టెలికాం కంపెనీలకు అదనపు ఆదాయం కావాల్సి ఉంది. అందువల్ల రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశముంది.
ఉచిత 5జీ డేటా కట్
5జీ విస్తరణ సమయంలో చాలా కంపెనీలు ఆన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించాయి. ఇప్పటికే కంపెనీలు వాటిని తొలగించి 5జీ డేటా ప్లాన్లకు అధిక ఛార్జీలు వసూలు చేస్తాయి. రానున్న ఏడాదిలో 5జీ నెట్‌వర్క్ ప్రీమియం సేవగా మారనుంది. హై స్పీడ్ డేటాను యాక్సెస్ చేసే ఖర్చును కంపెనీలు కొత్త ఏడాదిలో పెంచనున్నాయి.
శాటిలైట్ ఇంటర్నెట్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ కంపెనీ 2026లో ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించనుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ లభించాయి. ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచి చూస్తోంది. ఇంటర్నెట్ సౌకర్యం లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో స్టార్ లింక్ సేవలు అందించనుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్
దేశవ్యాప్తంగా ఈ ఏడాది 4జీ నెట్‌వర్క్‌ను విస్తరణను పూర్తి చేసిన బీఎస్‌ఎన్‌ఎల్.. వచ్చే ఏడాది 5జీ విస్తరణను అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న 4జీ పరికరాలు 5జీకి సిద్దంగా ఉన్నాయి. దీంతో వాటిని 5జీ సేవలకు త్వరలో పరీక్షించనుంది.




