World Boxing Championship : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ఫైనల్‌కు చేరిన ఆటో డ్రైవర్ కూతురు
గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ కూతురు అయిన మీనాక్షి హుడా (48 కేజీల విభాగం) ఫైనల్‌లోకి దూసుకెళ్లి సంచలనం సృష్టించింది.

World Boxing Championship :గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ కూతురు మీనాక్షి హుడా (48 కేజీల విభాగం) ఫైనల్‌లోకి దూసుకెళ్లి సంచలనం సృష్టించింది. మీనాక్షితో పాటు అంకుష్ ఫంగల్, పర్వీన్, నూపుర్ కూడా ఫైనల్‌లో తమ బెర్త్ ఖాయం చేసుకున్నారు. మొత్తం నలుగురు భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరడంతో భారత్‌కు కనీసం నాలుగు పతకాలు ఖాయమైనట్టే.
మీనాక్షి హుడా తన సెమీ-ఫైనల్ పోరులో కొరియాకు చెందిన బాక్ చో-రోంగ్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. మీనాక్షి దాడి ముందు కొరియా బాక్సర్ నిలబడలేకపోయింది. అటు ఇతర భారతీయ బాక్సర్లలో కూడా అంకుష్ ఫంగల్ (80 కేజీల విభాగం) ఆస్ట్రేలియాకు చెందిన మార్లన్ సెవెహోన్‌ను 5-0 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరాడు. అలాగే, నూపుర్ (80 కేజీల విభాగం) ఉక్రెయిన్‌కు చెందిన మరియా లోవచిన్‌స్కాపై విజయం సాధించింది.
మాజీ ప్రపంచ ఛాంపియన్ అరంధతి చౌదరి దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంతర్జాతీయ పోటీల్లోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో మూడుసార్లు ప్రపంచ కప్ పతక విజేత అయిన జర్మనీకి చెందిన లియోనీ ముల్లర్‌ను ఓడించి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. “నేను సంవత్సరన్నర తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తిరిగి వచ్చాను. ఆర్ఎస్సీ విజయంతో తిరిగి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా చివరి అంతర్జాతీయ అనుభవం పారిస్ (ఒలింపిక్స్ 2024) క్వాలిఫైయర్‌లో ఓటమితో ముగియడం, ఆ తర్వాత నా మణికట్టుకు ఆపరేషన్ జరగడం వల్ల మొదట్లో కొంచెం కంగారు పడ్డాను” అని అరంధతి తన అనుభవాన్ని పంచుకుంది.
భారత బాక్సర్ పర్వీన్ (60 కేజీల విభాగం) ఈ రోజు అత్యంత పెద్ద సంచలనం నమోదు చేసింది. పోలాండ్‌కు చెందిన ప్రపంచ బాక్సింగ్ కప్ రజత పతక విజేత రైగెల్స్కా అనేటా ఎల్జ్‌బియెటాతో జరిగిన కఠినమైన పోరులో పర్వీన్ 3-2 తేడాతో విజయం సాధించి, రింగ్‌లో తన సత్తాను నిరూపించుకుంది. ఈ విజయం పర్వీన్‌కు ఫైనల్‌లో స్థానాన్ని సంపాదించిపెట్టింది.
ఫైనల్‌కు చేరిన నలుగురు కాకుండా, ఇతర భారత బాక్సర్లకు కూడా ముందు ముఖ్యమైన పోరాటాలు ఉన్నాయి. ప్రీతి (54 కేజీల విభాగం) ఒలింపిక్ పతక విజేత, మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన హువాంగ్ సియావో-వెన్ నుంచి గట్టి సవాలును ఎదుర్కోవాల్సి ఉంది. అలాగే స్వీటీ బూరా (75 కేజీల విభాగం) ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా-సూ గ్రీట్రీతో తలపడనుంది. వీరితో పాటు నరీందర్, నవీన్ కూడా ఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అభినాష్ జామ్వాల్ ఉక్రెయిన్‌కు చెందిన అల్విన్ అలీయెవ్‌తో తన టోర్నమెంట్ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




