IPL 2025: నీకు దండం పెడుతా ఆ స్లోగన్ మానెయ్ మావా! జిగిరి దోస్త్ కి కోహ్లీ రిక్వెస్ట్
RCB అభిమానుల ప్రియమైన నినాదం ‘ఈ సాలా కప్ నమ్దే’ ఇకపై వినిపించకపోవచ్చు. విరాట్ కోహ్లీ స్వయంగా దీన్ని ఉపయోగించవద్దని సూచించాడని ఎబి డివిలియర్స్ వెల్లడించాడు. గత 18 సీజన్లుగా ట్రోఫీ గెలవలేకపోవడం వల్ల అంచనాలు పెంచడం విరాట్ ఇష్టపడటం లేదని అర్థమవుతోంది. అయితే, RCB ఈ సారి ట్రోఫీ గెలుస్తుందనే ఆశతో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలో కొత్త అధ్యాయం మొదలైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈ సంవత్సరం కప్ మనదే) అనే నినాదం కొత్తేమీ కాదు. సంవత్సరాలుగా RCB ఫ్యాన్స్ తమ జట్టుపై నమ్మకాన్ని వ్యక్తపరచడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ నినాదాన్ని ఇకపై బహిరంగంగా ఉపయోగించవద్దని విరాట్ కోహ్లీ సూచించాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఎబి డివిలియర్స్ ఇటీవల వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ రూమ్‌లో మాట్లాడిన డివిలియర్స్, “ఇటీవల నేను ‘ఈ సాలా కప్ నమ్దే’ అన్నాను. అప్పుడు విరాట్ నాతో డైరెక్ట్ మెసేజ్‌లో, ‘దయచేసి ఆ మాట మళ్లీ అనొద్దు’ అని చెప్పాడు. దాని వల్ల కొంచెం ఆశ్చర్యపోయాను. నిజం చెప్పాలంటే, ప్రతి ఏడాది ‘RCB గెలుస్తుంది’ అని చెప్పి నేను కూడా విసిగిపోయాను” అని వెల్లడించాడు.
RCB ఇప్పటి వరకు ఒక్కసారి కూడా IPL ట్రోఫీ గెలుచుకోలేదు. 18 సీజన్లుగా విఫలమవుతూనే ఉన్నందున, విరాట్ కోహ్లీ ఈ నినాదాన్ని ఉపయోగించడం ద్వారా అంచనాలు పెంచుకోవడం ఇష్టపడటం లేదని డివిలియర్స్ చెప్పాడు.
IPL ట్రోఫీ గెలవడం ప్రపంచ కప్ గెలవడం కంటే తక్కువేమీ కాదు అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. “ఐపీఎల్‌లో 10 ప్రపంచ స్థాయి జట్లు పోటీ పడతాయి. ప్రతి సీజన్ కొత్త సవాళ్లను తెస్తుంది. ప్రయాణం, గాయాలు, జట్టు వ్యూహాలు—ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేస్తాయి” అని వివరించాడు. “టోర్నమెంట్ చివరి దశలో ఫిట్‌నెస్‌ను చక్కగా నిర్వహించిన జట్టే సాధారణంగా విజేతగా నిలుస్తుంది” అని అన్నాడు.
అయినప్పటికీ, డివిలియర్స్ RCB గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. “ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తామని నేను భావిస్తున్నాను. RCB ట్రోఫీ గెలిస్తే, విరాట్‌తో కలిసి దాన్ని ఎత్తడానికి నేను అక్కడే ఉంటాను!” అని చెప్పాడు.
రాబోయే 2025 ఐపీఎల్ సీజన్‌లో RCB కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఫాఫ్ డు ప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారడంతో, రజత్ పాటిదార్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో RCBకు నాయకత్వం వహించిన ఎనిమిదవ ఆటగాడిగా పాటిదార్ నిలిచాడు. RCB అభిమానులు ఈ కొత్త మార్పులు జట్టుకు లక్కును తెస్తాయని ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ చెప్పినట్లు ‘ఈ సాలా కప్ నమ్దే’ అని చెప్పకుండా ఉన్నా, వారి కల నిజమవుతుందా? వేచి చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..