Video: ఇదేంటి ఇషాన్.. ఇలా కెమెరాకు అడ్డంగా బుక్కయ్యావ్.. చర్యలకు సిద్ధమైన బీసీసీఐ?
DY Patil T20 Tournament: టీమిండియాకు దూరమైన లెఫ్టార్మ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్న కిషన్.. మరో పెద్ద తప్పు చేసినందుకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Ishan Kishan BCCI Logo Helmet: టీం ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు పెద్దదిగా మారుతోంది. ఇప్పుడు విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు నుంచి విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో కిషన్ తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలను పట్టించుకోకుండా.. బీసీసీఐ ఆదేశాలను పాటించకపోవడంతో.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. వీటన్నింటి నడుమ అతడు చేసిన మరో తప్పు వెలుగులోకి రావడంతో మళ్లీ బీసీసీఐ కళ్లు ఎర్రజేస్తోంది.
డిసెంబర్ 2023 నుంచి టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఇటీవలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం డీవై పాటిల్ ముంబైలో జరుగుతున్న టీ20 టోర్నీలో పాల్గొంటున్నాడు. అయితే, అతని పునరాగమనం బాగాలేదు. శిక్ష విధించే అవకాశం ఉన్న బీసీసీఐ అత్యంత ముఖ్యమైన నిబంధనను విస్మరించడం గమనార్హం.
నిబంధనలు ఉల్లంఘించిన ఇషాన్ కిషన్..
డీవై పాటిల్ టి20 టోర్నీలో ఇషాన్ కిషన్ రిలయన్స్ 1 జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే తొలి గేమ్‌లో మైదానంలోకి రాగానే బ్యాటింగ్ కంటే హెల్మెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇషాన్ హెల్మెట్‌పై బీసీసీఐ లోగోను ముద్రించారు. దీని ద్వారా అతను ఓ నియమాన్ని ఉల్లంఘించాడు. దేశీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఆటగాళ్లు హెల్మెట్‌లు, జెర్సీలు లేదా మరే ఇతర పరికరాలపైనా బీసీసీఐ లోగోను ఉపయోగించకూడదని బీసీసీఐ ఆటగాళ్ల కోసం కఠినమైన నిబంధనను రూపొందించింది.
బీసీసీఐ లోగో హెల్మెట్ ధరించిన ఇషాన్ కిషన్ వీడియో..
View this post on Instagram
ఇంతకుముందు, టీమ్ ఇండియాకు ఆడే ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో తమ జట్లకు ఆడుతున్నప్పుడు దీనిని ఉపయోగించారు. కానీ, కొన్నేళ్ల క్రితం, బీసీసీఐ లోగోను ఉపయోగించకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత అలాంటి హెల్మెట్‌లు ధరించిన ఆటగాళ్లు బీసీసీఐ లోగోపై టేప్ పెట్టి వాటిని దాచేవారు. కానీ కిషన్ అలా చేయకుండా బోర్డు లోగో ఉన్న హెల్మెట్ ధరించి ఆడాడు. ఇప్పుడు బీసీసీఐ అతనికి జరిమానా విధించే అవకాశం ఉంది.
రెండు రోజుల క్రితమే బీసీసీఐ ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ఇషాన్‌ను మినహాయించింది. టీమ్ ఇండియా నుంచి విరామం తీసుకున్న తర్వాత, అతను పునరాగమనం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించారు. భారత జట్టులో లేని ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జే షా ఆదేశించారు. కానీ ఇషాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
