పిల్లలు మారం చేస్తున్నారని మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? ఇది తెలిస్తే మీ వెన్నులో వణుకే!
మొబైల్ ఫోన్ వాడకం పెద్దలతోపాటు పిల్లలోనూ పెరిగిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్లను వదలడం లేదు. పిల్లలు మాత్రం మొబైల్ ఫోన్లకు పూర్తిగా అడిక్ట్ అవుతున్నారు. గంటల తరబడి ఫోన్లను విడిచిపెట్టకుండా చూసేస్తున్నారు. దీంతో వారిలో చాలా సమస్యలు వస్తున్నాయి. అధిక మొబైల్ వాడకం పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్ ఫోన్ల వాడకం అనేది పెద్దల నుంచి పిల్లల వరకు సర్వసాధారణం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్లను వదలడం లేదు. పిల్లలు మాత్రం మొబైల్ ఫోన్లకు పూర్తిగా అడిక్ట్ అవుతున్నారు. గంటల తరబడి ఫోన్లను విడిచిపెట్టకుండా చూసేస్తున్నారు. దీంతో వారికి సరైన సమయంలో ఆహారం కూడా తీసుకోవడం లేదు. బయట ఆటలకు దూరం అవుతున్నారు.
ఇక, పిల్లల నుంచి బలవంతంగా ఫోన్లను లాగేసుకుంటే మాత్రం ఎక్కడా లేని అశాంతి, కోపం, చిరాకు ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ఫోన్లు పిల్లలకు వ్యసనంగా మారడంతో చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు దినచర్య, చదువు, క్రీడలు, సామాజిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాపోతున్నారు.
సుదీర్ఘ సమయంపాటు మొబైల్ ఫోన్ల వాడకం పిల్లల్లో ఏకాగ్రత, నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో తల్లిదండ్రులు వైద్యులను, సైకాలజిస్టులను కలిస్తున్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచేందుకు వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.
మొబైల్ ఫోన్ వాడకాన్ని ఎలా వదిలించాలి?
మొబైల్ ఫోన్ వ్యసనాన్ని దూరం చేయడానికి తల్లిదండ్రులు మొదట తమ పిల్లలతో స్పష్టంగా మాట్లాడాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక మొబైల్ ఫోన్ వాడకం ఆరోగ్యం, చదువు, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పిల్లలకు తెలియజేయాలన్నారు. సమయాన్ని తగ్గించడం, మొబైల్ ఫోన్ చూసేందుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించడం లాంటి చేయాలన్నారు. పిల్లలను ఇతర వినోద కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలన్నారు.
కుటుంబ సభ్యులతో ఆటలు, బహిరంగ కార్యకలాపాలు, చదువు, అభిరుచులు మొబైల్ ఫోన్ల నుంచి దృష్టి మరల్చడానికి సహాయపడతాయన్నారు. తల్లిదండ్రులు కూడా తమ సొంత మొబైల్ వాడకాన్ని పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పిల్లలు కూడా వారి నుంచి నేర్చుకుంటారన్నారు. పిల్లలను క్రమంగా మొబైల్ ఫోన్లకు దూరం చేసి ఇతర కార్యకలాపాల్లో నిమగ్నం చేయాలని సూచిస్తున్నారు.
మొబైల్ వ్యసనంతో తీవ్రమైన సమస్యలు
మొబైల్ ఫోన్లను ఎక్కువ సమయంపాటు వాడితే అనేక శరీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. కళ్లకు అలసట, చికాకు, దృష్టి మసకబారడం, తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అంతేగాక, పిల్లల్లో నిద్రలేమి, చిరాకు, ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం, ఏకాగ్రత తగ్గుతాయని పేర్కొన్నారు. మొబైల్ వ్యసనం కారణంగా పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేందుకు కూడా ఇష్టపడరని చెప్పారు. చదువుపైనే గాక, సామాజిక, భావోద్వేగాల అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అంతేగాక, ఆటిజం, ఏడీహెచ్‌డీ లాంటి తీవ్ర రుగ్మతల బారిన పడవచ్చని హెచ్చరిస్తున్నారు.
పేరెంట్స్ ఏం చేయాలి?
రోజులో పరిమిత సమయంలో మాత్రమే మొబైల్ వాడేలా చూడాలి పిల్లలు బయట ఆడుకోవడానికి, శారీరక శ్రమలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి రాత్రి పడుకునే ముందు మొబైల్ అస్సలు ఇవ్వకూడదు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి, వారిని పార్కులు లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లి ఆడించాలి. పిల్లలతో తరచూ ఆడుకోవాలి. యోగా, వ్యాయమం లాంటివి చేయించాలి.