రహస్యంగా ఫోన్ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో డెడ్ బాడీ మాయం! కట్ చేస్తే..
భర్తకు తెలియకుండా ఓ భార్య సీక్రెట్‌గా ఫోన్ మెయిన్‌టైన్ చేయసాగింది. ఆ రహస్యం కాస్తా భర్త కంట్లో పడటంతో.. సదరు పతి దేవుడు కోపంతో ఊగిపోయాడు. అంతే దృశ్యం మువీ తరహాలో భార్యను మూడో కంటికి తెలియకుండా చంపి, ఇంటి వెనకే పాతిపెట్టాడు. ఆనక ఎవరికీ అనుమానం రాకుండా దృశ్యం సినిమాలో మాదిరి భార్య ఎటో వెళ్లిపోయిందంటూ పోలీసులకు చెప్పి మొసలి కన్నీళ్లు కార్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు గట్టు కనిపెట్టడంతో మొగుడు గారు జైలుకు వెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గోరఖ్‌పూర్, డిసెంబర్ 27: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో లుథియానాలో అర్జున్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 21న గోరఖ్‌పూర్‌లోని ఇంటికి తిరిగొచ్చాడు. అర్జున్‌కు భార్య ఖుష్బూ ఉంది. ఇంటి వచ్చిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడుతూ కనిపించింది. దీంతో ఫోన్ గురించి ఆమెను ప్రశ్నించాడు. అయితే ఆమె తన వద్ద ఉన్న ఫోన్ ఎక్కడో దాచిపెట్టి ఫోన్ వాడటం లేదని బుకాయించింది. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అర్జున్ తన భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఆమెను ఇంటి వెనుక గొయ్యి తవ్వి పాతిపెట్టాడు.
తెల్లారిన తర్వాత తన భార్య ఖుష్బూ కనిపించడం లేదనీ, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరినీ నమ్మించాడు. అయితే రోజుల తరబడి ఎంత వెతికినా ఖుష్బూ జాడ కానరాలేదు. దీంతో పిల్లనిచ్చిన మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లుడే తన కూతురుని చంపి, ఆమెను మాయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె మృతదేహాన్ని నదిలో విసిరేశానని తెలిపాడు. నిందితుడు పోలీసులను గ్రామం వెలుపల ఉన్న నది ఒడ్డుకు తీసుకెళ్లి ఇక్కడే పడేశానని చెప్పాడు. రెండు గంటలపాటు వెతికినా ఎలాంటి జాడ కనిపించకపోవడంతో పోలీసులు తమను తప్పుదారి పట్టిస్తున్నట్లు గుర్తించారు. ఈసారి కాస్త డోస్ పెంచడంతో అసలు విషయం చెప్పాడు.
నిందితుడు చెప్పిన వివరాల మేరకు ఇంటి వెనుక తవ్వడంతో ఖుష్బూ మృతదేహం లభ్యమైందని గోరఖ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో నిందితుడు తన భార్యను హత్య చేశాడని తెలిపారు. వీరికి వివాహం జరిగి రెండేళ్లు అయిందని, పిల్లలు లేరని వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా అర్జున్‌ను అరెస్టు చేయగా, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




