వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
Taurus Horoscope 2026: వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శుభప్రదం. గురు, శని బలం వల్ల కోరికలు నెరవేరుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అద్భుత పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే ఏ లోటూ ఉండదు. 2025 కంటే 2026 మరింత కలిసివస్తుంది.

వృషభ రాశివారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగిపోతాయి. గురు బలం, శని బలంతో పాటు రాశ్యధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. సంవత్సరం ద్వితీయార్థంలో మరింత వైభవంగా, శోభాయమానంగా జీవితం సాగిపోతుంది. శని, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో, కొద్ది శ్రమతో అన్ని రంగాల్లోనూ సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టే పక్షంలో ఈ రాశివారికి ఏ విషయంలోనూ లోటు ఉండదు.
ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు
కొత్త సంవత్సరంలో జూన్ నెల నుంచి జీవితం చాలా వరకు సానుకూలంగా మారిపోతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా హోదా పెరగడంతో పాటు, సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. జూన్ తర్వాత మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. శని, గురు, రాహువులు అనుకూలంగా ఉండడం వల్ల తప్పకుండా శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ స్థానంలో రాహువు సంచారం వల్ల కెరీర్ పరంగా ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
కుటుంబ జీవితం, ప్రేమలు, పెళ్లిళ్లు
కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతాయి. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంలో ఆశించిన శుభకార్యాలు జరుగుతాయి. జూన్ లోపు సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి. సొంత ఆలోచనలతో, స్వయం నిర్ణయాలతో అనేక విధాలుగా పురోగతి చెందు తారు. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభ స్థానంలో ఉన్న శని వల్ల అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
అనుకూల పరిస్థితులు
గురు, శనుల బలం వల్ల దాదాపు ఏడాదంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అనేక అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
అనుకూలమైన నెలలు
ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత వల్ల 2025 కంటే 2026 మరింత బాగా ఉండే అవకాశం ఉంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఫిబ్రవరి, మే, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ నెలల్లో ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఈ నెలల్లో ఒకటి రెండు దుర్వార్తలు వినే అవకాశం కూడా ఉంది.