Watch Video: ‘క్వాటర్ మందు ఇస్తేనే లేస్తా..’ RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ! వీడియో
ప్రకాశం జిల్లాలో క్వాటర్ మందు కావాలంటూ ఆర్టీసీ బస్సు ముందు అడ్డంగా కూర్చున్న మహిళ.. బస్సును కదలనీయకుండా నానాయాగి చేసింది. క్వాటర్ మందు కావాలంటూ మద్యం మత్తులో అరగంటకు పైగా వీరంగం సృష్టించింది. చివరకు ఆమెను రోడ్డు పక్కకు లాగేసి వెళ్ళిపోయిన డ్రైవర్.. ఇందుకు సంబంధించిన వీడియో..

యర్రగొండపాలెం, డిసెంబర్ 27: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ మహిళ చేసిన పనికి అందరూ తలలు బాదుకున్నారు. ఫుల్లు మందుకొట్టి ఓ ఆర్టీసీ బస్సు ముందు తిష్టవేసింది. ఆనక తనకు క్వాటర్ మందు కొనివ్వాలంటూ నానాయాగి చేసింది. ఈ విచిత్ర ఘటన ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు బస్టాండ్ వద్ద ఆగిన ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కి తమ గమ్యాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బస్సు బయల్దేరే సమయానికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ మహిళ బస్సు ముందు అడ్డంగా రోడ్డుపై కూర్చుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సదరు మహిళ తనకు క్వాటర్ మందు కావాలని పట్టుబట్టింది. లేదంటే బస్సును కదలనివ్వనని భీష్మించుకుని కూర్చుంది. దీంతో అరగంట వరకు బస్సు అక్కడే నిలిచిపోయింది.
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మహిళ ఎంతసేపటికి కదలకపోవడంతో అసహనానికి గురైన ప్రయాణికులు, స్థానికులు బలవంతంగా ఆమెను పక్కకు లాగేశారు. దీంతో బస్సు ముందుకు కదిలింది. యర్రగొండపాలేం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని జనాలు మద్యానికి బానిసై తీవ్ర దుర్భర స్థితిలో బతుకుతున్నారు. తాజాగా మద్యం కోసం గొడవ చేసిన మహిళ కూడా నల్లమల ప్రాంతంలోని ఓ గూడేనికి చెందిన మహిళగా భావిస్తున్నారు. అధికారులు స్పందించి నల్లమల చుట్టుపక్కల గూడేలను సందర్శించి, వారి జీవితాలను బాగు చేయాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




